ప్రపంచానికి వైరస్ లు కొత్త కాదు, చరిత్రలో ఎన్నో వైరస్ లు పుట్టుకొచ్చాయి. మానవ జాతిని వణికించాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వైరస్ లను చాలామటుకు మనిషి అరికట్టగలిగాడు. ప్రాణనష్టాన్ని తగ్గించగలిగాడు. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మానవజాతిని విపరీతంగా వణికించిన వైరస్ ఎబోలా.
1976లో ఎబోలాను గుర్తించారు. ఈ వైరస్ కారణంగా పశ్చిమ ఆఫ్రికాలో 11వేల 323 మంది మరణించారు. సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత అత్యధిక మరణాలు ఇవే. ఇప్పుడీ సంఖ్యను కరోనా అధిగమించింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 11వేల 885కు చేరుకుంది. దీన్నిబట్టి ఇది ఎంత ప్రమాదకరమైన వైరస్ అనే విషయాన్ని గ్రహించవచ్చు.
ప్రతి వందేళ్లకు ఒకసారి మానవజాతిని ఏదో ఒక వైరస్ సవాల్ చేస్తూనే ఉంది. 1720లో ప్లేగు వ్యాధి, 1820లో కలరా, 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ లు ప్రపంచాన్ని వణికించాయి. ఈ 3 వైరస్ ల కారణంగా భూమ్మీద దాదాపు 2 కోట్ల మంది మరణించిన ఉంటారని అనధికారికంగా ఓ అంచనా. ఇప్పుడు మళ్లీ వందేళ్లకు కరోనా వచ్చింది.
సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా, కరోనా వ్యాప్తి చెంది ఇన్ని రోజులైనా ఈ వైరస్ కు ఇంకా విరుగుడు కనుక్కోలేకపోవడం మానవజాతికి సవాల్ అనే చెప్పాలి. చైనా, ఫ్రాన్స్ దేశాల్లో దీనికి యాంటీడోస్ కనుకున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ అదింకా పూర్తిస్థాయిలో నిరూపితం కావాల్సి ఉంది.
ప్రస్తుతానికైతే కరోనాను ఎదుర్కోవాలంటే మానవాళి ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ స్వీయ నియంత్రణ. ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, సమూహాలకు దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే కరోనా కొంత తగ్గే అవకాశం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విశ్లేషణ ప్రకారం.. ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం మరో 3 వారాల పాటు కొనసాగనుంది.