రాజకీయాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవడమే తప్ప జనం కోసం పాటుపడే సీన్ ఉందా అంటే అబ్బే మాకు అది అలవాటు లేదేనన్న మాటే వస్తోంది. ఎంతసేపూ విమర్శలు చేయడం ద్వారా రాజకీయ కాలుష్యాన్ని పెంచడానికే ముప్పొద్దూ సరిపోతోంది.
సిక్కోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని అధికార పార్టీ అరాచకాలు అటూ తెల్లారిలేస్తూనే చిట్టా తీస్తారు. ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి మొదలు మంత్రులను ఎవరినీ వదలకుండా దూషణల పర్వం కొనసాగిస్తారు. దానికి అటు నుంచి కూడా ప్రతి విమర్శలు ఎటూ ఉంటాయి మరి.
మరో వైపు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు అయితే కరోనా వైరస్ విపత్తు విషయంలో ఏపీ సర్కార్ ఏమీ చేయడంలేదని తేల్చేశారు. సర్కార్ చోద్యం చూస్తోందని, జనాలను ఆదుకోవడంలేదని ఆరోపణలను జోరుగా లంకించుకుంటారు.
నిజానికి ప్రపంచానికే ఎక్కడా అర్ధం కాని తీరున కరోనా దూకుడు సాగుతోంది. ఏపీ సర్కార్ సహా అంతా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో జనాలకు సంబంధించిన బాధ్యత ఎక్కువగా ఉంది. జనం బయట తిరగకుండా తమను తాము కాపాడుకోవాల్సిఉంది.
మరి ఆ దిశగా తమ్ముళ్ళు ప్రజలను చైతన్యం ఏమైనా చేస్తున్నారా అంటే అది మానేసి బురదేసి అవతల పక్షాన్ని జనాల్లో పలుచన చేయడం ద్వారా తగ్గించి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన తప్ప మరేమీ కనిపించడంలేదుగా.
ఓ వైపు మ్రుత్యు ఘంటికలు మోగిస్తూ కరోనా భూతం తన పదఘట్టనలతో కరాళ న్రుత్యం చేస్తోంది. ఇదంతా చావుకు వచ్చిందని ప్రపంచ జనమంతా మరో వైపు గగ్గోలు పెడుతున్నారు. ఆ సంగతి పక్కన పెట్టి ఇంకా దూషణ భూషణలకు తెర తీస్తున్నారంటే ఏపీలో ఇవన్నీ చూసిన కరోనా సైతం నాకంటే ముదురు వైరస్ బాచ్ ఇక్కడే ఉన్నారని అనుకోవడంలో తప్పేముంది తమ్ముళ్ళూ.