ప్రతి ఒక్కరికీ జీవితంలో ఓ మలుపు ఉంటుంది. అదే వాళ్ల జీవితాల్లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. దాన్ని సరైన మార్గంలో వినియోగించుకుంటే…అంచెలంచెలుగా ఎదుగుతూ పోతారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా జీవితం తలకిందులవుతుంది.
అందాల బొమ్మ పాయల్ రాజపుత్ నటనా ప్రస్థానంలో కూడా ఓ టర్నింగ్ పాయింట్ ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఒక్కసారిగా ఆమెను ప్రముఖ హీరోయిన్ను చేసింది. ఈ సినిమాతో కుర్రకారు మతులను పోగొట్టిన పాయల్…ఇక సినీ అవకాశాల కోసం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ సినిమాలో బోల్డ్‌గా కనిపించిన పాయల్‌ను ఆ దృష్టితోనే అభిమానులు చూడటం మొదలు పెట్టారు. అందుకే ఆమెకు బోల్డ్ హీరోయిన్ అనే పేరు స్థిరపడింది.
అయితే పాయల్ మాత్రం ఈ పేరు సంతృప్తి చెందలేదు. ఎలాగైనా ఆ పేరు పోగొట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తోంది. తాజాగా పాయల్ ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తోంది. ఆ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే పాయల్‌పై టాలీవుడ్లో ఓ ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక హీరోయిన్గా పాయల్ రాజపుత్ ఎంపికైందని, త్వరలోనే ఈ భామ ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అవుతుందనేది హల్చల్ చేస్తున్న వార్తలోని సారాంశం. ఈ వార్త పాయల్ దృష్టికి వెళ్లింది. ట్విటర్ ద్వారా ఆమె తనపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలో నిజం లేదని ఆమె కొట్టి పారేశారు. అలాగే ఆమె ట్విటర్ ద్వారా ఆ వార్తను ఎలా ఖండించారో చదవండి….
‘అందరికీ నమస్కారం. నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. నేను చేస్తున్న సినిమాల గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు కొత్తగా ఏ సినిమాని అంగీకరించలేదు. అలాగే బాలకృష్ణ సార్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజంలేదు. గమనించగలరు. అందరికీ ధన్యవాదాలు’ అని పాయల్ ట్వీట్ చేశారు.
పాయల్ వార్తలు చదువుతున్నట్టుగా…ముఖ్యాంశాలు చెప్పేసి, చివరల్లో ధన్యవాదాలని తప్పుకున్నారు. ఇవన్న మాట పాయల్ తనకు సంబంధించిన వార్తలపై చెప్పిన కబుర్లు.