చంద్రబాబును రాజకీయ గండర గండడు అంటారు. అపర చాణక్యుడు అని టీడీపీ అనుకూల మీడియా ఒక పెద్ద మోత మోసేస్తూ ఉంటుంది. విజనరీ అని మరోటని బాబుని అలా పల్లకీ మోత మోస్తూ భ్రమల్లోనే ఉంచడంతో ఎల్లో మీడియా టాలెంటే వేరు.
అయితే బాబు 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. దానికి కారణం జగన్ అన్న సంగతి తెలిసిందే. జగన్ బాబుకి అలాంటి ఘోర పరాజయాన్ని తొలిసారి పరిచయం చేసి ఆయన రాజకీయ జీవితంలో మాయని మచ్చను మిగిల్చారు. ఇక చూస్తే 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి తాను తప్పక సీఎం అవుతాను అని చంద్రబాబు హడావుడు చేస్తున్నారు. వచ్చేది మేమే అని గంభీరంగా ప్రకటిస్తున్నారు.
మరి ఏపీలో రాజకీయాన్ని చూస్తే అసలు అలా ఉందా అన్నదే అందరి మాటగా ఉంది. ఇక చంద్రబాబుని జనాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అంటున్నారు. చంద్రబాబు జమానా ముగిసినట్లే ఆయన రాజకీయం పూర్తిగా నిన్నటి మాట అని చేదు నిజం చెప్పేశారు.
అంతే కాదు ఈసారి బాబుని ఓడించే బాధ్యత వైసీపీలో ఎవరూ తీసుకోవాల్సిన అవసరం లేదని, ఒక్కడు చాలు ఆయనను ఘోర పరాజితుడను చేయడానికి అంటూ ఆ పేరు కూడా దాడి మాస్టారు చెప్పారు. ఆ ఒక్కడు ఎవరో కాదు ఆయన వారసుడే. ఆయన ఇంటి వాడే.
ఒక్క నారా లోకేష్ చాలు చంద్రబాబుని మాజీ ముఖ్యమంత్రిగా శాశ్వతంగా అలా ఉంచేయడానికి అంటూ దాడి విసిరిన సెటైర్లు తమ్ముళ్లకు ఏ కోశానా జీర్ణించుకోలేనివే అంటే అతిశయోక్తి కాదేమో. అంటే బాబుకు 2024లో సన్ స్ట్రోక్ మహా గట్టిగానే తగులుతుంది అన్న మాట.