ఇవ్వాళ రేపు పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సమ్ థింగ్ డిఫరెంట్ గా చేస్తే తప్ప జనాలకు సినిమా రీచ్ కావడం లేదు. ఆ రీచ్, ఆ బజ్ లేకపోతే జనాలు థియేటర్ కు రావడం లేదు. అందుకే పబ్లిసిటీ ప్లానింగ్ లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈవారం విడుదలయ్యే పక్కా కమర్షియల్ సినిమాకు కూడా దర్శకుడు మారుతి డిఫరెంట్ ప్లానింగ్ తో వెళ్లారు. కేవలం ఇంటర్వూలు కాకుండా వాటికి మీమ్స్ జతచేసి అట్రాక్షన్ గా వుండేలా చూసుకున్నారు.
అంత వరకు బాగానే వుంది. మరో అడుగు ముందుకు వేసి ఐమాక్స్ దగ్గర క్రేజీగా వీడియో రివ్యూలు చెప్పేవారిని తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఇవ్వాళే పక్కా కమర్షియల్ విడుదలైతే రివ్యూ ఎలా చెబుతారో చెప్పండి అంటూ చెప్పించుకుని ఆనందించారు. అది వీడియో చేసి వదిలారు.
మారుతి మిడ్ రేంజ్ లో ఓ స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ప్రభాస్ తో, మెగాస్టార్ తో సినిమాలు లైన్ లో వున్నాయి. అలాంటి దర్శకుడు ఇలా సమీక్షలు చెప్పించుకోవడం ఫన్ కోసం అని ఆయన అనుకుని వుంటే వుండొచ్చు. కానీ అది ఆయన స్థాయిని తగ్గిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యూ ట్యూబ్ లో క్రేజ్ కోసం సమీక్షలు డిఫరెంట్ గా చెబుతూ ఒక స్టయిల్ ఏర్పరచుకుని వుండొచ్చు. కానీ సినిమా చూడకుండానే వాళ్లను పిలిచి దగ్గర కూర్చో పెట్టుకుని సమీక్షలు చెప్పించుకోవడం ఏమిటో? వాళ్లు పాపం, ఎవరు మ్యూజిక్ డైరక్టర్ అన్నది కూడా తెలియకుండా ‘థమన్..చించేసాడు బ్రో’ అనడం ఏమిటో?
ఇలా ముందుగా పిలిచి వాళ్లను తన దగ్గర కూర్చో పెట్టుకుని ముచ్చటించడం వల్ల రేపు సినిమా విడుదలయ్యాక మొహమాటానికైనా నెగిటివ్ మాట్లాడరని, ఇదో రకం స్ట్రాటజీ అని మారుతి మీద కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే స్ట్రాటజీ అయితే వర్కవుట్ అవుతుందేమో చూడాలి.