మహారాష్ట్ర తమాషా అందరం చూస్తూనే ఉన్నాం. సాంకేతిక పరమైన మలుపులు ఎన్ని తిరిగినా, ఉధ్ధవ్ ఠాక్రే పదవి పోగొట్టుకోవడం, అఘాఢీ పక్షాలు ప్రతిపక్షంలోకి వెళ్లడం ఖాయమనే తెలుస్తోంది. తర్వాత ఏం జరగబోతోంది? బిజెపి స్వల్పకాలిక వ్యూహమేమిటి? దీర్ఘకాలిక వ్యూహమేమిటి? అది ఊహించడానికే యీ వ్యాసం. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి-శివసేన కూటమి పోటీ చేసింది. ఇద్దరూ కలిసి ఉంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడి వుండేది. కానీ ముఖ్యమంత్రి పదవి దగ్గర పేచీ వచ్చింది. బిజెపి వదలనంది. అది శివసేన అహాన్ని దెబ్బ తీసింది. దానికి ముందు ఐదేళ్లగా నడిచి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బిజెపి తమను చిన్న చూపు చూసిందని, అనేక సార్లు అవమానించందనే బాధ ఒకటుంది. అందువలన ముఖ్యమంత్రి శివసేనవారే కావాలనే పేచీ పెట్టుకుని, బిజెపితో పొత్తు తెంచుకుని ఎన్‌సిపి, కాంగ్రెసులతో కలిసి మహారాష్ట్ర వికాస్ అఘాఢీ అనే కూటమి ఏర్పరచి రెండేళ్లకు పైగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. అది బిజెపిని మండిస్తోంది.
మహారాష్ట్రలో దశాబ్దాలుగా కాంగ్రెసుతో పోటీ పడినది శివసేన. ప్రాంతీయవాదంతో మొదలుపెట్టి, గత 30 ఏళ్లగా హిందూత్వవాదంలోకి వెళ్లి, బిజెపిని ఆకర్షించింది. పొత్తు కట్టింది. పదేళ్ల క్రితం దాకా బిజెపి శివసేనకు జూనియర్ భాగస్వామిగా ఉంటూ వచ్చింది. 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణం తర్వాత నుంచి క్రమేపీ శివసేన బలహీన పడసాగింది. బాలాసాహెబ్ తన వారసుడిగా ఎంచుకున్న కొడుకు ఉద్ధవ్, అంత ఉద్దండుడు కాదు. సోదరుడి కొడుకు రాజ్ ఠాక్రే శివసేన ప్రాంతీయ నినాదాలను హైజాక్ చేశాడు. జాతీయ స్థాయిలో మోదీ ఎదుగుదల ప్రారంభమైన దగ్గర్నుంచి హిందూత్వవాదాన్ని బిజెపి పూర్తిగా సొంతం చేసుకుంది. శివసేన ప్రాభవం తగ్గితగ్గి, చివరకు బిజెపికి జూనియర్ అయిపోయింది. బిజెపి నాయకులు శివసేన నాయకులను లక్ష్యపెట్టడం మానేశారు. ఫడణవీస్ శివసేన వాళ్లను బాగా యిరిటేట్ చేశాడు.
ఈ కారణాల వలన తమ మద్దతు లేనిదే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చిన తరుణంలో అదను చూసి ఉద్ధవ్ దెబ్బ కొట్టాడు. అందరి కంటె అత్యధిక స్థానాలు తెచ్చుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం బిజెపి రగిలిపోయింది. తక్కిన పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందేమోనని ఊహించిన శరద్ పవార్ తన సోదరుడి కొడుకు అజిత్ ద్వారా నాటకం ఆడించి, బిజెపిని మరింత భంగపాటుకి గురి చేశాడు. దాని తర్వాత బిజెపి తగ్గి ఉంటుందని అతను ఆశించాడు. అఘాఢీలో ప్రయాణం మరీ కుదుపులు లేకుండా సాగుతోంది. ఇప్పుడు హఠాత్తుగా శివసేన చీల్చడానికి అఘాఢీ ఏర్పాటునే కారణంగా చూపిస్తున్నాడు, ఏక్నాథ్ శిందే. అఘాఢీ ఏర్పడి శివసేనకు ముఖ్యమంత్రి పదవి, ఎన్‌సిపికి ఉపముఖ్యమంత్రి పదవి అనుకున్నపుడు ఉద్ధవ్ శివసేన తరఫున తన కుమారుడు ఆదిత్య ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. కాదు, నువ్వే ఉండాలి అని ఎన్‌సిపి, కాంగ్రెసు పట్టుబట్టాయి. నిజానికి ఉద్ధవ్‌కు పదవీకాంక్ష లేదు. అందుకే ఫడణవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరలేదు. తండ్రి బలవంతంపై రాజకీయాల్లోకి వచ్చిన అతను, తన తండ్రిలాగానే పదవులు చేపట్టకుండా, రిమోట్ కంట్రోలుతో ప్రభుత్వాన్ని నడపాలని అనుకున్నాడు. అది సాగలేదు. ఫడణవీస్ పడనీయలేదు.
ఉద్ధవ్ అనారోగ్యపీడితుడు. పాలనానుభవం లేదు. 2019 ఎన్నికల తర్వాత శివసేన తరఫున ఏ శిందేనో కూర్చోబెడితే సరిపోయేది. కానీ గతంలో బాలాసాహెబ్ బతికున్న రోజుల్లో నారాయణ రాణేను కూర్చోబెడితే అతను జెల్ల కొట్టాడు. అందుకని యీసారి కొడుకు ఆదిత్యనే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని ఉద్ధవ్ భార్య పట్టుబట్టింది. ఆ ప్రతిపాదన అఘాఢీ ముందు పెడితే ఎన్‌సిపి, కాంగ్రెసు వల్లకాదన్నాయి. అందువలన తనే ముఖ్యమంత్రి అయ్యి, పార్టీలో, ప్రభుత్వంలో ఆదిత్యకు చాలా ప్రాధాన్యత యిస్తూ వచ్చాడు. ఆదిత్య తటస్థులను కూడా మెప్పించి, పార్టీని విస్తరించడానికై నూతన విధానాలను అవలంబించి, యువతను ఆకర్షిస్తున్నాడు. ఇది శివసేనలో ఎప్పణ్నుంచో ఉన్న సీనియర్ నాయకులకు కడుపు మండించింది. వారిలో శిందే ఒకడు.
58 ఏళ్ల శిందే ఠాణేలో ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి, శివసైనికుడిగా చేరాడు. బాలాసాహెబ్ విశ్వాసాన్ని చూరగొని త్వరగా పైకి ఎదిగాడు. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ప్రస్తుతం శాసనసభా నేతగా ఉన్నాడు. మంచి మాస్ లీడరు కాబట్టి, ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉండడానికి నిరాకరించినప్పుడు యితను అవుతాడనుకున్నారు. కానీ శరద్ పవార్ అభ్యంతర పెట్టాడు. పైగా ప్రభుత్వం ఏర్పడ్డాక సంజయ్ రావూత్ అధికార ప్రతినిథిగా వ్యవహరించ సాగాడు. దానాదీనా శిందే పలుకుబడి తగ్గింది. అతని అసంతృప్తిని యిప్పుడు బిజెపి ఉపయోగించుకుంది. పార్టీ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల కంటె ఎక్కువ మందిని తన వైపు లాక్కున్నాడు కాబట్టి, యాంటీ డిఫెక్షన్ చట్టం వర్తించదు. కొత్త పార్టీగా నమోదు చేసుకోవచ్చు.
లేదా తమదే అసలు శివసేన అని చెప్పుకోవచ్చు. అవతల బాల ఠాక్రే కొడుకు ఉండగా మాది అసలు శివసేన అనడం శివసైనికులకు నచ్చదు. అందువలననే శివసేనకు ముందు ఏదో ఒకటి చేర్చి తమ పార్టీగా ప్రకటించవచ్చు. బాల ఠాక్రే అనే పేరు చేరుస్తామంటే కుదరదంటున్నాడు ఉద్ధవ్. అందువలన హిందూత్వ అనే పేరు చేర్చినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఎందుకంటే పార్టీ చీలికకు కారణం హిందూత్వయే అని శిందే చెప్తున్నాడు. ఉద్ధవ్ హిందూత్వ విధానానికి తిలోదకాలు యిచ్చి, హిందూత్వ విరోధ పక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పరచాడని, అందుకే తాము అతనిని వీడామని చెప్తున్నాడు. అదొక్కటే తప్ప ఉద్ధవ్ చేసిన హిందూత్వ వ్యతిరేక చర్య మరేదీ అతను చెప్పటం లేదు. అతని దృష్టిలో బిజెపితో చేతులు కలిపితే హిందూత్వ, కలపకపోతే హిందూత్వ-వ్యతిరేక అని తేలుతోంది. ఉద్ధవ్‌తో బిజెపితో తెగతెంపులు చేసుకుని రెండేళ్లు దాటింది. అనగా శిందే భాషలో హిందూత్వ విధానాన్ని వదిలి రెండేళ్లు దాటింది. మరి ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఎందుకు కొనసాగినట్లు?
అతనే కాదు, అతనితో పాటు తిరుగుబాటు బావుటా కింద చేరినవాళ్లందరూ నిన్నటిదాకా మంత్రులుగా ఉండి అధికారం వెలగబెట్టినవారే! వాళ్లంతా హిందూత్వ వ్యతిరేక విధానాలు అవలంబించినట్లు అర్థం చేసుకోవాలా? వీటికి శిందే వద్ద సమాధానాలు లేవు. పైకి ఏం చెప్పినా, లోపల గొడవంతా అహంకారానికి, అధికారానికి సంబంధించినది. ఆనాడు ఉద్ధవ్ బిజెపితో పొత్తు తెంపుకున్నా, ఈనాడు శిందే ఉద్ధవ్‌తో తెంపుకున్నా అంతా ఇగోకు సంబంధించిన వ్యవహారమే. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా బిజెపి తమను ఖాతరు చేయకపోగా, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి శివసేనకు వదలలేదనే ఉద్ధవ్ బిజెపిని వదిలాడు. ఉద్ధవ్ ఆదిత్యను ప్రమోట్ చేస్తూ తన స్థాయిని తగ్గిస్తున్నాడని శిందే శివసేనను వదిలాడు. హిందూత్వ విషయంలో బిజెపి, శివసేన దొందుకు దొందే.
పైగా శివసేనకు ప్రాంతీయతావాదం జబ్బు అదనంగా ఉంది. అవసరార్థం ఎన్‌సిపి, కాంగ్రెసులతో చేతులు కలిపినా స్వతస్సిద్ధంగా ఉన్న లక్షణాలను మార్చుకుందని అనుకోవడానికి లేదు. రేపు అధికారం పోయాక హిందూత్వ, మరాఠీ వాదాల పేరు చెప్పి ఎంతెంత అల్లర్లు చేస్తుందో చూడవచ్చు. వాళ్లు గుర్తింపు తెచ్చుకున్నదే గూండాయిజం ద్వారా! ఇంతకీ పార్టీ ఉద్ధవ్‌తో ఉంటుందా? శిందేతో ఉంటుందా? ఎమ్మెల్యేలనైతే ఎలాగోలా లోబరుచుకున్నారు, కానీ కార్యకర్తల మాటేమిటి? వాళ్లకు సిబిఐ కేసులు, ఈడీ నోటీసుల బాధ లేదు కదా! తమ పార్టీ చీలడంపై, చీల్చినవారిపై, చీల్పించినవారిపై వారి దృక్పథం ఎలా ఉంటుంది అనేదే ఆసక్తికరమైన విషయం. 1999లో నారాయణ రాణె నిష్క్రమణ తర్వాత శివసేన ముఖ్యమంత్రి లేడు. 20 ఏళ్ల తర్వాత యిన్నాళ్లకు శివసేన ముఖ్యమంత్రి వస్తే, యిప్పుడీ శిందే వచ్చి అతన్ని లాగిపారేస్తే వాళ్లు సంతోషిస్తారా?
బిజెపి, శిందే కలిసి ఉద్ధవ్‌ను కూలదోయగలరు. తర్వాత? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బిజెపి శిందేను సిఎం చేస్తుందా? 55 సీట్ల ఉద్ధవ్‌నే ముఖ్యమంత్రిగా ఒప్పుకోని బిజెపి, 40 సీట్ల శిందేను ఒప్పుకుంటుందా? అసలు దానికి ఫడణవీస్ ఒప్పుకుంటాడా? అతని పదవీకాంక్షయే, ఏకపక్ష ధోరణులే బిజెపి-శివసేన మధ్య సయోధ్య చెడడానికి కారణమయ్యాయని చెప్తున్నారు. ఇప్పుడు ఫడణవీస్ సిఎం అయ్యి, దానికి శిందే డిప్యూటీ సిఎం అయితే శివసేన కార్యకర్తలు ఊరుకుంటారా? శివసైనికుణ్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, అతని స్థానంలో వేరే పార్టీవారిని కూర్చోబెట్టాడని శిందేపై, అతని అనుచరులపై మండిపడరా? ఇలాటి గొడవ వస్తుందని బిజెపి ప్రస్తుతానికి శిందేను ముఖ్యమంత్రిని చేసిందనుకుందాం. అప్పుడు ఫడణవీస్ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకుంటాడా? ఒకసారి ముఖ్యమంత్రి చేసి, మళ్లీ ఉపముఖ్యమంత్రి అంటే అతనికి రుచిస్తుందా? పార్టీ అతన్ని ఒప్పించిందనుకుందాం. అప్పుడు కీలకశాఖలన్నీ అతనే తీసుకుని సూపర్ సిఎంగా వ్యవహరించవచ్చు.
బిజెపి- రెబెల్ శివసేన ప్రభుత్వం నడుస్తున్నంతకాలం ఫడణవీస్ శివసేన రెండు వర్గాలను బలహీన పరచడానికే చూస్తాడు. ఉద్ధవ్ వర్గం చేసే వీధి పోరాటాలను అణిచే మిషతో శివసైనికులను అరెస్టు చేయడాలు జరగడం సహజం. యోగి ఆదిత్యనాథ్ ట్రిక్కులు ఫడణవీస్ అలవర్చుకుంటే వారి యిళ్లు, శివసేన ఆఫీసులను కూడా బుల్డోజర్లతో కూల్పించవచ్చు. కానీ మహారాష్ట్రలో అది అంత సులభమైన విషయం కాదు. ఒక సంస్థగా, పార్టీగా శివసేన బలప్రయోగాలతోనే ఎదిగింది. బిజెపితో పొత్తు వీడడంపై, ఇన్నాళ్లూ తమకు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెసు, ఎన్‌సిపిలతో చేతులు కలపడంపై గ్రామీణ ప్రాంతాల్లో శివసైనికులు అసంతృప్తిగా ఉన్నారని, ఆ అసంతృప్తి ముంబయి ప్రాంతంలో లేదని పరిశీలకులు అంటున్నారు. శివసేన అర్బన్ పార్టీగానే పుట్టి, రూరల్‌కు విస్తరించింది.
బిజెపికి దూరం కావడంపై అసంతృప్తి ఉన్నా శిందే ప్రవర్తనను వారెంతవరకు సమర్థిస్తారో తెలియదు. ఎందుకంటే ఆఘాఢీ ఏర్పడినపుడు తన అభ్యంతరాలను అతను బహిరంగంగా వ్యక్తం చేయలేదు. పార్టీ వేదికలపై ఎక్కడా మాట్లాడినట్లు లేదు. పార్టీ ఆ అవకాశం యివ్వలేదని అనుకున్నా, పత్రికలకు యింటర్వ్యూలు యివ్వడం ద్వారా శివసేన క్యాడర్లో బిజెపి పట్ల అభిమానాన్ని పెంచే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అన్నిటికీ సమాధానంగా ఉద్ధవ్ మమ్మల్ని కలవడానికి సమయం కేటాయించడం లేదు అని మాత్రమే చెప్తున్నారు. విధానపరమైన నిర్ణయంపై చర్చ అంటే కలిసేవాడేమో! ఒక్కరైనా నా ఎదుటకు వచ్చి రాజీనామా చేయి అంటే చేసేసి ఉండేవాణ్ని అంటున్నాడు ఉద్ధవ్. అలా చెప్పే ధైర్యం యీ 39 ఎమ్మెల్యేలలో ఒక్కరికీ లేకపోయిందా? ఇప్పుడు ముంబయి వచ్చాక కొందరు ఉద్ధవ్ వైపు తిరుగుతారేమోనన్న భయం బిజెపికి కూడా ఉన్నట్లుంది. లేకపోతే రావూత్ని ఈడీ యీ రోజే రమ్మనమని అని ఉండదు.
విధానసభ ఎన్నికలలో 12 మంది శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగు చేశారని తెలిసిన తర్వాత ఉద్ధవ్ వారెవరు అని విచ్‌హంటింగ్ చేశాడా? అనుమానంపై ఎవరి పదవులైనా పీకేశాడా? అలా చేసినట్లు లేదే! చాలా మెతకగా వ్యవహరించాడు. అసలు 40 మంది జంప్ అయిపోతే, వెళ్లిపోయాక కానీ తెలుసుకోలేనివాడివి నువ్వేం ముఖ్యమంత్రివి అని శరద్ పవార్ అడిగాడట. నీ పోలీసులు ఏం చేస్తున్నారు? నీ యింటెలిజెన్సు వాళ్లు ఏమంటున్నారు? అన్నాట్ట. దీన్ని బట్టి ఉద్ధవ్ చేతకానివాడని తెలుస్తున్నపుడు, అతను అహంకారి, ఎవరి మాటా వినడు అని అనుకోవడం నప్పటం లేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు బిజెపితో పొత్తు కోరుకుంటున్నారని తెలిస్తే అతను ఆఘాఢీలోంచి బయటకు వచ్చేసేవాడేమో! కానీ బిజెపి అతనికి ఆ ఛాన్సివ్వదలచుకోలేదు. ప్రతీకారం తీర్చుకోవడానికి అతన్ని అవమానించాలనే పూనుకుంది. ఈ పేరు చెప్పి అతని పార్టీని చీల్చి, బలహీన పరచాలని అనుకుంది. బిజెపి యిప్పుడు తమ పార్టీని చీల్చడంపై గ్రామీణ శివసైనికుడు అసంతృప్తి చెందితే అన్ని ప్రాంతాల శివసైనికులు సంఘటితంగా బిజెపిని ఎదుర్కోవచ్చు.
ముఖ్యమంత్రి ఐనా, ఉప ముఖ్యమంత్రి ఐనా శిందే ఎలా వ్యవహరిస్తాడో ప్రస్తుతానికి తెలియదు. బిజెపి దాష్టీకాన్ని భరించలేక ఎదిరించవచ్చు. తను కీలుబొమ్మను కానని చూపుకోవడానికి బిజెపి దాష్టీకం చేయకపోయినా చేసిందని యాగీ చేయవచ్చు. ఏడో వంతు ఎమ్మెల్యేలు మాత్రమే తన వెంట ఉన్నారు కాబట్టి తనకు విలువ నీయటం లేదని ఫీలై, తన పదవి ఉపయోగించి, ఎన్సీపీ, కాంగ్రెసు, ఆఖరికి బిజెపి ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసుకోవడానికి చూడవచ్చు. శివసేనకున్న అపారమైన ఆస్తులపై కన్నేసి, ఏవో కారణాలు చెప్పి వాటిని ప్రభుత్వపరం చేస్తూ, ఉద్ధవ్ పట్టును సడలించవచ్చు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలను ఎలా రక్షించుకుంటాడో, ఏ విధంగా వాళ్లను తృప్తి పరుస్తాడో కూడా వేచి చూడాలి. వీళ్లందరికీ పదవులిద్దామంటే మరి బిజెపి ఎమ్మెల్యేల సంగతేమిటి? వాళ్లేమీ సర్వసంగ పరిత్యాగులు కాదు కదా! ఇలా చూస్తే శిందే వర్గం బిజెపిలో విలీనమై పోవడమొకటే మార్గంగా కనబడుతోంది.
కానీ మేమెవ్వరితోనూ విలీనం కాకుండా ఒరిజినల్ శివసేన మాదే అని క్లెయిమ్ చేస్తాం అంటోంది శిందే వర్గం. ఎమ్మెల్యేలను ఎగరేసుకుని పోవడం వేరు, పార్టీని కైవసం చేసుకోవడం వేరు. ఉద్ధవ్ పార్టీపై పట్టు నిరూపించుకుంటే అప్పుడు శిందే గతి ఏమిటి? ఈ ఎమ్మెల్యేలు యిలాగే ఉంటారా? కొందరు మాతృసంస్థకు వెళ్లిపోతానంటారా? అదే జరిగితే శిందే విలువ పడిపోతుంది. బిజెపిలో చేరితే కనుక యిప్పటికే అనేక మంది నాయకులతో ఉన్న బిజెపిలో అతనూ ఒకడవుతాడు. ఒకవేళ ఉద్ధవ్ తరఫు నుంచి ఉన్న 16 ఎమ్మెల్యేలలో కొందరు వచ్చి శిందేతో చేరితే శిందే బిజెపి నుంచి ఎక్కువ రాబట్టాలని చూడవచ్చు. సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్నా, ఫిరాయింపు దారుల డిమాండ్లు తట్టుకోలేక బిజెపి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు తెప్పించవచ్చు. ఇలాటి క్రీడలన్నీ కాంగ్రెసు ఎప్పుడో ఆడి చూపించింది. ఇప్పుడు బిజెపి ఆడుతోంది. అంతే తేడా! ఎన్నికలు జరిగితే మాత్రం భీకరమైన పోరు చూడవచ్చు, ముఖ్యంగా రెండు హిందూత్వ ఫోర్సెస్ ఐన శివసేన, బిజెపిల మధ్య! ఇదంతా అయితే, గియితేల వ్యవహారం. ఏది ఎలా జరుగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. వేచి చూడాల్సిందే.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)