తను కొత్తగా ఏ సినిమాలు అంగీకరించలేదని, ప్రస్తుతం చేతిలో 3 సినిమాలు మాత్రమే ఉన్నాయని.. ఈమధ్య హీరోయిన్ కృతి షెట్టి క్లారిటీ ఇచ్చింది. ఆ మేరకు ఆమె చేస్తున్న 3 సినిమాల వివరాలు కూడా వెల్లడించింది. అయితే ఆమెతో సంప్రదింపులు మాత్రం ఆపడం లేదు మేకర్స్. తాజాగా ఇలానే మరో సినిమా కృతి షెట్టి వద్దకు చేరింది.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా మారబోతున్నాడు. సాయితేజ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. సుకుమార్ దీనికి కథ అందిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా కృతి షెట్టిని ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ రిఫరెన్స్ తో కృతి షెట్టిని కలిసిన దర్శకుడు, ఆమెకు కథ నెరేట్ చేశాడు.
ప్రస్తుతానికైతే కృతి షెట్టి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒప్పుకుంటే మాత్రం అన్నదమ్ములిద్దర్నీ కవర్ చేసినట్టవుతుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో కృతి షెట్టి ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రామ్-లింగుసామి సినిమా ఉంది. దీంతోపాటు శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. అటు సుధీర్ బాబు-ఇంద్రగంటి సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. వీటిలో ఏదో ఒకటి పూర్తయితే తప్ప, కృతి షెట్టి కొత్త సినిమాపై క్లారిటీ రాదేమో.