క‌రోనా వ్యాక్సినేష‌న్లో కీల‌క ద‌శ దాటిన అమెరికా

క‌రోనా నివార‌ణ వ్యాక్సినేష‌న్లో అమెరికా కీల‌క ప్ర‌గ‌తిని సాధించింది. దేశ జ‌నాభాలో 50 శాతానికి మించిన స్థాయిలో రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేసింది అమెరికా. కొన్ని రాష్ట్రాల్లో స‌గం జ‌నాభా క‌న్నా…

క‌రోనా నివార‌ణ వ్యాక్సినేష‌న్లో అమెరికా కీల‌క ప్ర‌గ‌తిని సాధించింది. దేశ జ‌నాభాలో 50 శాతానికి మించిన స్థాయిలో రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేసింది అమెరికా. కొన్ని రాష్ట్రాల్లో స‌గం జ‌నాభా క‌న్నా ఎక్కువ మందికే రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యింద‌ని తెలుస్తోంది.

అలాంటి చోట మాస్కులు, సోష‌ల్ డిస్టెన్సింగ్ నియ‌మాల‌ను కూడా ప్ర‌భుత్వాలు స‌వ‌రిస్తున్నాయి. క‌నీసం స‌గం జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తే క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో 50 శాతం ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసి అమెరికా క‌రోనా విష‌యంలో ధీమాను వ్య‌క్తం చేస్తూ ఉంది.  ఈ అంశంపై అమెరిక‌న్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. 50 శాతం జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. అలాగే క‌నీసం ఒక డోస్ వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య కూడా మ‌రింత ఎక్కువ‌గా ఉంది. 

కొన్ని వార్తా చాన‌ళ్ల క‌థ‌నాల ప్ర‌కారం.. ఆ దేశ జ‌నాభాలో 70 శాతం మందికి క‌నీసం ఒక డోస్ వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. క‌నీసం ఒక డోస్ వ్యాక్సినేష‌న్ కూడా గ‌ణ‌నీయమైన ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని అంచ‌నా.

ఈ నేప‌థ్యంలో క‌నీసం ఒక డోస్ వేసుకున్న వారి సంఖ్య 70 శాతం, మొత్తం జ‌నాభాలో రెండు డోసుల వ్యాక్సిన్ ను వేయించుకున్న వారి సంఖ్య 50 శాతం ఉండ‌టంతో అమెరికా క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డంలో కీల‌క ప్రగ‌తిని సాధించిన‌ట్టు అవుతుంద‌ని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అమెరికాలో ప్ర‌స్తుతం రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య 20 వేల స్థాయిలో కొన‌సాగుతూ ఉంది.