చంద్రబాబు.. ఓ ‘గడియారం’ కథ

పిట్టకథలు, చెత్త లాజిక్ లతో తనకి తానే భుజం తట్టుకోవడం చంద్రబాబుకి బాగా అలవాటు. మేకపోతు గాంభీర్యంతో తనతో పాటు, తన చుట్టూ ఉన్నవారిని సర్వనాశనం చేయడం ఆయనకే సొంతమైన అరుదైన విద్య. అదే…

పిట్టకథలు, చెత్త లాజిక్ లతో తనకి తానే భుజం తట్టుకోవడం చంద్రబాబుకి బాగా అలవాటు. మేకపోతు గాంభీర్యంతో తనతో పాటు, తన చుట్టూ ఉన్నవారిని సర్వనాశనం చేయడం ఆయనకే సొంతమైన అరుదైన విద్య. అదే కోవలో ఇప్పుడు మూడేళ్ల తర్వాత అధికారం మనదేనంటూ మరోసారి మహానాడు ముందుగా టీడీపీ కార్యకర్తల్ని భ్రమల్లో నెట్టడానికి సిద్ధపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా మరో మూడేళ్లు మాత్రమే జగన్ అధికారంలో ఉంటారని జమిలి జపం చేశారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో మరో మూడేళ్లు వేచి చూద్దామంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడాయన కొత్తగా గడియారం కథ ఎత్తుకున్నారు.

గడియారం ముల్లు తిరిగి అదే చోటకు వస్తుందని, అదే విధంగా తాను మరోసారి అధికారంలోకి వస్తానని అంటున్నారు చంద్రబాబు. టీడీపీకి కూడా ఒకరోజు వస్తుందని, ఆ రోజు తప్పుచేసిన ఎవర్నీ వదిలిపెట్టనని గాలికబుర్లు చెప్పుకుంటున్నారు. కళ్లు మూసుకుంటే మరో మూడేళ్లు గడిచిపోతాయి, ఆ తర్వాత మీ వెనక ఎవరుంటారో చూసుకోండి అంటూ అధికారులకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు బాబు.

గతంలో వైఎస్ఆర్ కొట్టిన దెబ్బ బాబుకి గట్టిగానే తగిలినా.. రాష్ట్ర విభజన అనే అంశం కలిసొచ్చి నవ్యాంధ్రలో ఆయనకి అధికారం దక్కింది. అంటే ఒకరకంగా గడియారం ముల్లు తిరిగి బాబు దగ్గరకు వచ్చింది. కానీ ఈసారి పెద్దాయన కొడుకు జగన్ కొట్టిన దెబ్బకి బాబు దిమ్మతిరిగింది. ఈసారి గడియారం ముల్లు (అధికారం) తిరిగి బాబు దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే.. బాబు దగ్గరకు గడియారం ముల్లు వస్తే ఏమవుతుందో ప్రజలకి బాగా తెలుసు. అక్కడ ఆగితే సర్వనాశనం. అందుకే గడియారం ముల్లు ఎన్నిసార్లు తిరిగినా బాబు దగ్గర మాత్రం ఆగదు.

చంద్రబాబు చెప్పిన గడియారం ముల్లు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాబుపై ట్రోలింగ్ బీభత్సంగా సాగుతోంది. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు గట్టిగానే తగులుకుంటున్నాయి.మూడేళ్ల తర్వాత గడియారం ముల్లు వెనకాలే వస్తుందని అంటున్న చంద్రబాబు.. అసలు తన వెనకాల ఎంత మంది ఉంటారో చూసుకోవాలని వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి.

మూడేళ్ల తర్వాత మీ వెనక ఎవరుంటారో చూసుకోండి అంటూ వైసీపీని హెచ్చరిస్తున్న బాబు.. అసలు టీడీపీ వెనకాల ఎంతమంది నిలబడతారో చూసుకోవాలని, మూడేళ్ల తర్వాత టీడీపీ దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేస్తున్నారు.

పొరపాటున గడియారం ముల్లు మరోసారి చంద్రబాబు దగ్గర ఆగితే, ఆ గడియారం కనిబెట్టింది కూడా నేనే అనే రకం బాబు. అందుకే గడియారం ముల్లు కూడా ఆయన్ని అవాయిడ్ చేస్తోందట. ఇలా.. బాబు ''గడియారం ముల్లు'' కథపై సోషల్ మీడియాలో రకరకాల సెటైర్లు పడుతున్నాయి. మూడేళ్ల తర్వాత అధికారం తమదేనంటూ చెబుతున్న బాబు, అది ఎలా వస్తుందనే లాజిక్ కూడా చెబితే బాగుండేది. అది చెప్పే దమ్ములేక, ఇలా గడియారం ముల్లు అంటూ పిట్టకథలు చెప్పుకొని జూమ్ లో కాలక్షేపం చేస్తున్నారు.