'పగ సాధిస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటా.. వడ్డీతో సహా చెల్లిస్తా..' అంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. బహుశా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆ పనిలో ఉంటే.. ఇప్పుడు ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఇలాంటి డైలాగులు చెబుతున్నారు.
తన హయాంలో తన పార్టీలో చేరే వారు తప్ప మిగతా నేతలంతా పాపులే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి వేధించారు. ఎవరినో వద్దు.. ఒక భూమా నాగిరెడ్డి, మరో కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్లను ఎంతలా ముప్పు తిప్పలు పెట్టారో బహిరంగ రహస్యమే.
చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని తన తండ్రికి ఏమైనా జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత అని అప్పట్లో భూమా అఖిలప్రియ వాపోయారు పాపం. భూమాపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆయన ఆసుపత్రి పాలయ్యారు. చివరకు తెలుగుదేశంలోకి చేరక తప్పలేదు కూడా!
అలా తెలుగుదేశం పార్టీలోకి చేరే వరకూ నేతలను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక ప్రెటీ కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డిని నెలా రెండు నెలల పాటు జైల్లో పెట్టారు. ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. అలా రాజకీయ ప్రత్యర్థులపై వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఒప్పుడు తమపై ప్రతీకార చర్యలు సాగుతున్నాయని వాపోతే.. సానుభూతి వస్తుందా?
ఇక గతాన్ని అంతా మరిచిపోయారన్నట్టుగా.. ఇప్పుడు మళ్లీ ప్రతీకారం అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. తమకు అధికారం దక్కగానే అందరి మీదా ప్రతీకార చర్యలుంటాయని, పోలీసులు కూడా మినహాయింపు కాదని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు! అంటే.. చంద్రబాబు నాయుడు అధికారం కోరుకుంటున్నది ఇలాంటి ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాబోలు!
అయినా ఈ వయసులో చంద్రబాబు నాయుడు పగ, ప్రతీకారం.. అంటూ మాట్లాడితే ప్రత్యర్థులు భయపడతారా! అయినా.. తమ వారిని కాపాడుకోవడానికి సుప్రీం కోర్టు వరకూ వెళ్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇది వరకే ప్రకటించారు. మరి అదే మేలేమో!