ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాపాలను కరోనా కాలపు చిత్రగుప్తుడు ఒక్కొక్కటిగా రాస్తున్నారు. ప్రతి పాపానికి వడ్డీతో సహా ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఈ కాలపు చిత్ర గుప్తుడు హెచ్చరిస్తున్నారు. ఇంతకూ కరోనా కాలపు చిత్రగుప్తు డెవరు? ఏమా కథో తెలుసుకుందాం.
కరోనా కాలపు చిత్ర గుప్తుడంటే మరెవరో కాదు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయనే జగన్ చేస్తున్న తప్పులన్నింటిని రాస్తున్నారట. 2024లో అధికారంలోకి రాగానే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన అధికారుల సంగతి తేల్చుతారట. స్వయంగా తానే ఈ హెచ్చరికలు చేశారు.
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నిర్వహించిన ఆన్‌లైన్ నిరసన దీక్షలో చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన హెచ్చరికలే ఏంటో తెలుసుకుందాం.
‘ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి. అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు మిడిసిపడుతున్నారని.. వారి ప్రతి అరాచకానికీ వడ్డీతో బదులు తీరుస్తాం’ అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
చిత్ర గుప్తుడంటే ఎవరో తెలుసు కదా! యమ ధర్మరాజు ఆస్థానంలో కొలువు. మనుషుల పాప పుణ్యాల చిట్టా రాస్తుంటాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత చిత్ర గుప్తుడి పాప పుణ్యాల లెక్కలను బట్టి స్వర్గం లేదా నరకం సంభవిస్తుంటాయని హిందూ పురాణాల సారాంశం.
ప్రస్తుతం చంద్రబాబు మాటలు వింటుంటే చిత్రగుప్తుడే గుర్తుకొస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులు, పాపాల లెక్కలన్నిం టిని బాబు రాసుకుంటున్నారట. ఆ తర్వాత తాము అధికారంలోకి రాగానే పాపాలను బట్టి వడ్డీతో సహా రుణం చెల్లిస్తామనే హెచ్చరికలతో పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంతో పాటు ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి తన పాలనలో ఎలాంటి పాపాలు చేశారో, ఇప్పుడు వాటికి వడ్డీతో సహా జగన్ ఎందుకు రుణం చెల్లిస్తున్నారో …చంద్రబాబు ఒక్కసారైనా ఆలోచించారా? ఈ ప్రతీకారాలతో ప్రజలకు ఒరిగేదేమిటి? అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న.