పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వున్న అనుబంధం తెలియంది కాదు. ఇప్పుడు ఈ అనుబంధం త్రివిక్రమ్ టీమ్ కు కూడా పాకేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ అభిమాన పాత్రుడిగా, ప్రియ శిష్యుడిగా మారిపోయిన సంగీత దర్శకుడు థమన్, అలాగే త్రివిక్రమ్ సినిమాలకు పాటలు రాసే టీమ్ లో ఒకరైన రామజోగయ్య శాస్త్రి కలిసి జనసేనకు సేవలు అందిస్తున్నారు.
ఈ ఇద్దరు కలిసే ఇటీవల పవన్ సినిమా వకీల్ సాబ్ కోసం 'మగువా..మగువా' అనే పాటను అందించారు ఇప్పుడు ఈ ఇద్దరు కలిసే జనసేన కార్యక్రమం 'మన నది..మన నుడి' కి ఓ ప్రచార గీతాన్ని తయారుచేసారు. నది ప్రాశస్యాన్ని, నుడి ప్రాముఖ్యతను వివరిస్తూ రామ్ జో రాసిన పాటకు థమన్ స్వరాలు సమకూర్చారు. జనసేన యూ ట్యూబ్ చానెల్ లో ఈ గీతాన్ని అప్ లోడ్ చేసారు.
మన నది మన నుడి అంటూ ఒక కార్యక్రమాన్ని ఓ వారం క్రితం ప్రకటించారు. దీనికోసం ఓ వెబ్ సైట్ కూడా రూపొందించారు. అయితే ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే, పవన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు, చరిష్మాకు ఈ పాట ఇలా విడుదల కాగానే అలా వైరల్ కావాలి. ట్రెండింగ్ లోకి రావాలి. కానీ లోడ్ చేసి గంటలు గడుస్తున్నా ఇప్పటికి గట్టిగా పదహారు వేల హిట్స్ కు మించి రాకపోవడం ఆశ్చర్యం.
అదే ఇటీవల పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ అయితే సర్రున దూసుకుపోయింది. అంటే పవన్ ఫ్యాన్స్ పూర్తిగా సినిమా పరంగా ఆయనను ఫాలో అవుతారు. అభిమానిస్తారు తప్ప, ఇతరత్రా కాదనుకోవాలేమో?