ఆడపిల్లల పేర్లతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరవడం.. దాని ద్వారా మరింత మంది అమ్మాయిలకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ లు పంపడం, వారితో మాటామాటా కలపడం, వారి పరిస్థితులను అంచనా వేసుకుని, తనకు తన ఫ్రెండ్ ఒకరు గూగుల్ లో ఉద్యోగం ఇప్పించాడని చెప్పడం, వారు నమ్మితే.. ఆ ఉద్యోగం ఇప్పించిన ఫ్రెండ్ గా మరో నకిలీ ఖాతాతో రంగంలోకి దిగడం…మాయమాటలతో వీలైనంతగా దండుకోవడం.. తాజాగా వెలుగులోకి వచ్చిన జోగడ వంశీ కృష్ణ లీలలు ఇవి. ఒక ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించగా, ఈ వంశీ కృష్ణ కథలన్నీ బయటపడ్డాయి.
ఇతడు అనేక మందిని మోసం చేశాడని, సోషల్ మీడియా పరిచయాలతోనే కోట్ల రూపాయలు వారి నుంచి దండుకుని.. పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. విశేషం ఏమిటంటే ఇతడు గతంలో ఒక సారి పోలీసులకు దొరికాడు. బెయిల్ మీద బయటకు వచ్చి.. మళ్లీ అలాంటి వ్యవహారాలే సాగిస్తూ ఉన్నాడట. తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు ఇతడి గురించి గాలింపు చర్యలు సాగుతున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.
ఇతడు బోలెడన్ని పేర్లతో అనేక మందికి పరిచయం అయినట్టుగా తెలుస్తోంది. ముందుగా సుస్మిత అనే అమ్మాయిని లోబరుచుకుని, ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా అనేక మందితో చాట్ చేసినట్టుగా తెలుస్తోంది. తన గురించి సుష్మిత అందరికీ చెప్పినట్టుగా అక్కడ మెనేజ్ చేశాడు. ఐటీ కంపెనీల్లోకి బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలు ఇప్పించేవాడిగా తన గురించి సుస్మిత చెప్పినట్టుగా తనే అందరికీ చెప్పుకున్నాడు. వాళ్లు నమ్మి.. ఇతడితో కాంటాక్ట్ లోకి వచ్చారు. వారి నుంచి అయిన కాడికి దండుకున్నాడట.
ఇతడి మోసాలు అంతటితో ఆగిపోలేదు. అనేక రకాలుగా అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నాడు. విలాస వంతమైన జీవితాన్ని గడపసాగాడట. గుర్రప్పందాలు, ఇతర జూదాలు.. అక్కడ పరిచయాలు, కొందరు ప్రముఖుల కూతుళ్లు కూడా ఇతడి లిస్టులో ఉన్నారని, ఇలా అనేక రకాలుగా మోసాలకు పాల్పడి కోట్ల రూపాయల స్థాయిలో మోసాలకు పాల్పడ్డాడట ఈ జోగడా వంశీకృష్ణ. ఇతడిది రాజమండ్రి అని, ఇతడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు.