ఉహాన్. చైనాలోని ఓ ఊరు. నిజానికి కొన్ని రోజుల క్రితం వరకు ఈ పట్టణం గురించి ప్రపంచానికి అంతగా తెలియదు. ప్రపంచలోని కోట్లాది కోట్ల ఊళ్లలో అదీ ఒకటి. కానీ కరోనా వైరస్ జన్మస్థలంగా ఇప్పుడు అది ప్రపంచంలోని ప్రతి పౌరుడికి పరిచయం అయిపోయింది.
ఉహాన్ అంటే జంతువల వింత మార్కెట్..ఉహాన్ అంటే కరోనాకు పుట్టినిల్లు..కానీ అదే పుహాన్ లో చైనా అద్భుతాలు సాధించింది. కరోనాను ఎదుర్కొని విజయం సాధించింది. చావులు, కరోనా బారిన పడిన వారు ఎక్కువ మందే వున్నా, ఈ సంఖ్యను వీలయినంత తగ్గించడంలో చైనా చాలా చాకచక్యం ప్రదర్శించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎంతయినా చైనా చైనాయే అనుకున్నారు. అనుకుంటున్నారు అంతా.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా అనుమానాలు అనేకం వ్యక్తం అవుతున్నాయి. చైనా అంటే చుట్టూ దుర్భేధ్యమైన గోడ కట్టుకున్న దేశం మాత్రమే కాదు. సమాచారం బయటకు పొక్కకుండా ఐరన్ కర్టెన్ వేసుకున్న దేశం కూడా. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మన దగ్గరలా కాదు వ్యవహారం. ఉన్నట్లుండి దేశంలో ఎంత ప్రముఖుడైనా అంతర్థానం అయిపోవడానికి ఆస్కారం వున్నదేశం అది. స్వేచ్ఛగా నొరెత్తేందుకు చాలా తక్కువ అవకాశం వున్న దేశం.
ఇప్పుడు సోషల్ మీడియాలో వూహాన్ వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉహాన్ లో కరోనా మరణాలు లెక్కకు అందనంత సంఖ్య లో వుండి వుంటాయని అనుకునేలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉహాన్ లో విద్యుత్ ఆధార శవ దహన యంత్రాలు రేయింబవళ్లు నిర్విరామంగా పని చేసాయి. దాదాపు 80లక్షల మొబైల్ సిమ్ కార్డులు ఒక్కసారిగా వాడకుండా పోయాయి. పట్టణంలో అనేక వేల అపార్ట్ మెంట్లలో దీపాలు వెలగడం లేదు. ఎందుకిలా? అసలు ఏం జరిగింది? అన్న అనుమానాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇదే ఇండియా అయితే పరిస్థితి వేరుగా వుండేది. నిన్నటికి నిన్న విశాఖలో కరోనా విలయతాండవం చేస్తొంది అని పుట్టించి, వాట్సాప్ లో చలామణీ చేసేసారు. కానీ చైనాలో పరిస్థితి వేరు అబద్దాలు ప్రసారం, ప్రచారం చేయడం మాట దేవుడెరుగు, నిజాలు కూడా అంత సులువుగా బయటకు రావు.
వాస్తవానికి ఇప్పటికి బయటకు చెబుతున్న లెక్కల ప్రకారం కరోనా మృతుల విషయంలో చైనా రెండో స్థానంలో వుంది. అక్కడి నుంచి వ్యాపించిన ఇటలీ మాత్రం ఫస్ట్ ప్లేస్ లోవుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న సందేహాలను చూస్తుంటే చైనాను మరే దేశం కూడా ఈ విషయంలో అధిగమించలేదేమో అనిపిస్తోంది.