ప్రస్తుతం తెలంగాణలో 19 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ చేశారు. ఏపీ విషయానికొస్తే ఆ నెంబర్ ప్రస్తుతానికి 3 దగ్గరే ఆగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీకి పెద్ద పాఠం కావాలి, చేతులు కాలక ముందే శానిటైజర్ పట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓవైపు అధికారిక చర్యలు తీసుకుంటున్నా, మరోవైపు విధాన నిర్ణయాల్లో మాత్రం మంత్రులు నత్తనడకలోనే ఉన్నారని అర్థమవుతోంది.
హైకోర్టు జోక్యంతో, వేలాదిమంది తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ఏపీలో మరో పదిరోజుల్లో టెన్త్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. యథాతథంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 4 రోజుల క్రితం ప్రకటించారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. మరి వాయిదా నిర్ణయాన్ని ప్రకటించడానికి అధికార యంత్రాంగం ఎందుకో మల్లగుల్లాలు పడుతోంది.
పరీక్షలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయో లేదో అని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు అందరిలో ఆందోళన ఉంది. ఇలాంటి టైమ్ లో ఆలస్యం చేసి అభాసుపాలు కావడం కంటే, వాయిదా వేసి అందరి ఆందోళన తగ్గించడం మేలు. ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ విషయంలో కూడా ఏపీ అధికారుల తాత్సారం విమర్శలకు తావిచ్చింది. రెండు రోజులు పేపర్ మూల్యాంకనం జరిగిన తర్వాత లెక్చరర్ల ఆందోళన నేపథ్యంలో చివరకు కరెక్షన్ ను వాయిదా వేశారు.
అంటే ఎవరో ఆందోళన చేస్తేనో, ఇంకెవరో వచ్చి కాస్త ఆలోచించండి అంటేనో.. అధికారులు, మంత్రులు దానిపై దృష్టిపెడుతున్నారు. చివరికి ఇలాంటి విషయాల్లో కూడా కోర్టులు మొట్టికాయలు వేసేంత వరకు వేచి ఉండకపోవడం మంచిది. తెలంగాణ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల్లో ఉన్న ఆందోళనలు అర్థం చేసుకుని చకచకా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
పరీక్షల వల్ల ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క ఇన్విజిలేటర్ కు కానీ కరోనా వస్తే.. అది ప్రభుత్వంపై పెద్ద మచ్చలా మిగిలిపోతుంది. అందుకే ఇకనైనా జాగ్రత్త పడటం మంచిది, నిర్ణయాలు తీసుకోవడంలో వివేకంతో పాటు వేగం కూడా ముఖ్యం.