రాజకీయ రొంపిలోకి బైరెడ్డి శబరి దిగుతానని ఉత్సాహం చూపుతున్నారు. ఈ యువతి వృత్తి రీత్యా డాక్టర్. అనేక పార్టీలు మారి, ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తే శబరి. తాజాగా ఆమె వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తాతలు, తండ్రుల గొప్పదనం గురించి ఆమె ఏకరువు పెడుతున్నారు.
తప్పుని తప్పు అని చెప్పినందుకు వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని శబరి ఆరోపిస్తున్నారు. ఇదేమైనా నియంతృత్వమా, రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ఆమె పెద్దపెద్ద ప్రశ్నలే వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘తప్పుడు సమాచారం వస్తే.. డాక్టర్‌గా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నాకుంది. పారాసిటమాలే ట్రీట్మెంట్ అని సీఎం చెబుతున్నారు. అది జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ కరోనా వైరస్ అంటే జ్వరం మాత్రమే కాదు. వేరే ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇదే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పాను. పెద్ద స్థాయిలో ఉన్న మీలాంటి వారు చెబితే.. ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఇంతవరకు నేను రాజకీయం చేయలేదు. ప్రజల కోసం ముందుకు వచ్చి మాట్లాడా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
తనను ‘చెప్పులతో కొడతామని బెదిరిస్తారా… మీ పార్టీలో ఉన్న వాళ్ల ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదన్నది తెలియదా. ఇలాంటి రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది. మహిళలపై విమర్శలు చేస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో తెలియదా? మహిళల గురించి ఒక్క మాట మాట్లాడినా… కామెంట్ చేసినా… ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం.. మూడు సంవత్సరాలు జైలు శిక్ష. ఇదంతా అవగాహన లేదా? రాజకీయాలు కొత్తేం కాదు. మా తాతల నుంచి రాజకీయాలను ఎన్నో చూశాం. డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. సీఎం జగన్ గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. లేదంటే బీజేపీ నేతగా నేనే స్వయంగా యాక్షన్ తీసుకోవలసి ఉంటుంది’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు.
మొత్తానికి కర్నూలు జిల్లాలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబానికి చెందిన బైరెడ్డి ఆడబిడ్డను చెప్పులతో కొడతామని బెదిరించిన వెధవ ఎవరు? మరీ ఈ స్థాయిలో దిగజారి మాట్లాడిన వాళ్లకు మాత్రం తగిన శిక్ష పడాల్సిందే!