కరోనా ఎఫెక్ట్.. తిరుపతి లడ్డూ ఫ్రీ

కరోనా ప్రభావంతో ఇప్పటికే తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. అలిపిరి గేట్ మూసేయడంతో పాటు, నడకదారి మార్గాన్ని కూడా మూసేశారు. దీంతో తిరుమల నిర్మానుష్యమైంది. అయితే ఇన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు లడ్డూల…

కరోనా ప్రభావంతో ఇప్పటికే తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. అలిపిరి గేట్ మూసేయడంతో పాటు, నడకదారి మార్గాన్ని కూడా మూసేశారు. దీంతో తిరుమల నిర్మానుష్యమైంది. అయితే ఇన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు లడ్డూల విషయంలో లెక్క తప్పారు. దర్శనాలు నిలిపివేస్తామని నిర్ణయించడానికి ముందే, లడ్డూ తయారీని నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ ఆ పని చేయలేదు. దీంతో తిరుమలలో 60వేలకు పైగా స్వామివారి లడ్డూలు మిగిలిపోయాయి. వీటిని తీసుకెళ్లడానికి కొండపై భక్తులు లేరు.

ఒకప్పట్లా తిరుమల లడ్డూ రోజుల తరబడి ఫ్రెష్ గా ఉండదు. 2-3 రోజులు దాటితే అది పాడైపోతుంది. అందుకే ఆ 60వేల లడ్డూల్ని ఎలాగైనా పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది టీటీడీ. ఈ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో మొత్తంగా ఉన్న ఉద్యోగులందరికీ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొండపై నుంచి 60వేల లడ్డూల్ని కిందకు తీసుకొచ్చింది. సాయంత్రం నుంచి పంపిణీ మొదలవుతుంది. ఇక్కడ కూడా రద్దీ ఉండకూడదు కాబట్టి.. డిపార్ట్ మెంట్స్ వారీగా ఒక్కొక్కరికి టైమ్ స్లాట్స్ కేటాయించి లడ్డూల్ని ఉచితంగా అందజేస్తారు.

ఇక ఆంద్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనతా కర్ఫ్యూకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రోజున ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటు పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అనుమానిత కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖలోని కేజీహెచ్ హాస్పిటల్ లో ఓ హెడ్ నర్స్ కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే ఆమెను క్వారంటైన్ గదికి తరలించారు.

అటు కరోనా పాజిటివ్ కేసు బయటపడిన అల్లిపురం ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈరోజు రెండో విడత క్లోరినేషన్ చేపట్టారు. నిన్న చేపట్టిన క్లోరినేషన్ కు అదనంగా ఇంకేమైనా ప్రాంతాలు, ప్రజల సందర్శించే స్థలాల్ని గుర్తించి ఈరోజు క్లోరినేషన్ చేశారు. గ్రామ వాలంటీర్ల సహాయంతో ఎక్కడికక్కడ అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం.

దేవుడికి కోపం వచ్చింది