ప్రముఖ హీరోయిన్ అనుష్క ప్రేమ , పెళ్లి గురించి జరిగినంత ప్రచారం… బహుశా మరే ఇతర హీరోయిన్‌పై జరిగి ఉండదేమో. టాలీవుడ్లో ‘సూపర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అనుష్క తన నటనా ప్రదర్శనతో దర్శకనిర్మాతల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. తాజాగా ఆమె ‘నిశ్శబ్దం’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క లీడ్ రోల్లో హేమంత్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ను ఛేదించుకొస్తున్నారు.
అయితే కరోనా ఎఫెక్ట్ లేకపోతే, అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఏప్రిల్ 2న సినిమా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో అనుష్క ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా అనుష్క తన ప్రేమ సంబంధిత ఎవరికీ తెలియని విషయాలను షేర్ చేసుకున్నారు. తనకూ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అందులో ఇతరులు వేలు, కాలు పెట్టడం అసలు ఇష్టం ఉండదన్నారు. అలాగే తన ప్రేమ , పెళ్లి గురించి వదంతులు వ్యాప్తి చేసేవాళ్లకు కూడా కొన్ని సంగతులు చెప్పారామె.
ఒక్కప్పుడు తాను కూడా ప్రేమలో పడినట్లు అనుష్క గతాన్ని గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల క్రితం ప్రేమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అది తన జీవితంలో అత్యంత తీయని ప్రేమ అని పేర్కొన్నారు. అయితే ఆ ప్రేమ కొనసాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితులు అనుకూలించకపోవడంతో విడిపోయామని చెప్పారు. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పడం ఇష్టం లేదని అనుష్క తేల్చి చెప్పారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే తామిద్దరం మంచి మంచి స్నేహితులమని అనుష్క చెప్పుకొచ్చారు.