ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం రోజున ప్రజలు స్వీయ నిర్భందాన్ని పాటించాలని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం రోజు ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్ సర్వీసులు, విద్యుత్తు, అగ్నిమాపక సిబ్బంది, పాలు లాంటి నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా వాటిని జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా స్వచ్ఛందంగా నిలిపి వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు, ట్వీట్ కూడా చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటించేందుకు జనతా కర్ఫ్యూ దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇది ఒక ప్రారంభంగా భావించి కరోనా మహమ్మారి నివారణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందని చాటుదామని ఆయన పిలుపునిచ్చారు.
కరోనాను నివారించేందుకు చర్యలు తీసుకోవడం అందరి అవసరం అని జగన్ అభిప్రాయపడ్డారు. భయపడాల్సిన అవసరం లేదని, కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వ పరంగా కూడా అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటించాలని ఏపీ సీఎం కోరారు.