TV9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పరిస్థితి ఇప్పుడు అంత బాగాలేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వాడే. న్యూస్ చానల్స్‌లో ఓ ట్రెండ్ సృష్టించిన రవిప్రకాశ్….ఆ తర్వాత అన్నం పెట్టిన సంస్థకే కన్నం పెట్టాలనుకుని అసలుకే ఎసరు తెచ్చుకున్నాడు. ఇప్పుడాయన ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు.
తాజాగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంటిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చుట్టుముట్టారనే వార్త సంచలనం రేకెత్తిస్తోంది. మళ్లీ ఏమైందబ్బా అని తెలుసుకోవాలని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అయితే పోలీసులు వెళ్లింది మాత్రం రవిప్రకాశ్ కోసం మాత్రం కాదని సమాచారం. మరెందుకు అనే ప్రశ్న వెంటనే మీ నుంచి వస్తుందని తెలుసు. అక్కడికే వెళ్దాం.
రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తాకు ఆశ్రయం ఇచ్చారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణాన్ని 2018లో తీసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే ఒకట్రెండు నెలలు మాత్రం ఒప్పందం ప్రకారం కంతులు చెల్లించారు. ఆ తర్వాత రుణం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది.
దీంతో ఈ పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేశారు. కానీ నిందితుల ఆచూకీ దొరకలేదు. చివరికి రవిప్రకాశ్ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. తాజాగా రవిప్రకాశ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టి… సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదన్న మాట రవిప్రకాశ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడం వెనుక ఉన్న అసలు కథ.