దేవునికైనా దెబ్బే గురువంటారు. దేవుని సంగతేమో గానీ, న్యూస్ చానళ్లకు మాత్రం సరైన గురువు కరోనా వైరస్ అని చెప్పక తప్పదు. ఏదైనా సంఘటన జరిగితే ఎలక్ట్రానిక్ మీడియా చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఎలక్ట్రానిక్ మీడియా తాను చేసే “అతి”కి ముద్దుగా పెట్టుకున్న పేరు “జర్నలిజం సామాజిక బాధ్యత”. ఆ సామాజిక బాధ్యతతో ఇప్పుడు కరోనా బాధితులకు ఎందుకు పలకరించడం లేదనేదే ప్రశ్న.
2018, ఫిబ్రవరిలో అతిలోక సుందరి, ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందారు. ఆమె బాత్రూంలో గుండె పోటుతో ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా తెలుగు చానళ్లు శ్రీదేవి మరణం ఎలా సంభవించి ఉంటుందో చెప్పేందుకు….బాత్రూం టబ్‌లో పడుకుని, పోర్లాడి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
న్యూస్ స్టూడియో నుంచి న్యూస్ రీడర్ / యాంకర్ మాట్లాడుతూ గంభీర, జీరబోయిన కంఠంతో ఇప్పుడు శ్రీదేవి ఎలా మరణించి ఉంటారో మా రిపోర్టర్ …X, Y, Z వివరిస్తారు అని ప్రకటించారు.
అవతల వైపు నుంచి రిపోర్టర్ చేతిలో చానల్ లోగోతో ముందుకొచ్చారు. ఇక చెప్పడం స్టార్ట్ చేశారు.
“అందాల ముద్దుగుమ్మ , భూలోక సౌందర్యరాశి, మూడు తరాల యువత మనసులను దోచుకున్న ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటాక ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిఉన్న శ్రీదేవిని కుటుంబ సభ్యులు సమీపంలోని రషీద్ ఆస్పత్రికి హుటాహుటీన తరలించారు. అయితే అప్పటికే ఆమె ఈ లోకాన్ని వదిలి తన పుట్టిల్లైన ఇంద్రలోకానికి వెళ్లిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీదేవి మరణవార్త విని యావత్ ప్రపంచం మూగబోయింది…అసలు శ్రీదేవి ఎలా మరణించి ఉంటారంటే…అంటూ ఆ రిపోర్టర్ బాత్రూంలోకి వెళతారు. బాత్రూంలో శ్రీదేవి ఎలా ప్రవర్తించి ఉండొచ్చో రిపోర్టర్ ఒక అంచనాతో నడుచుకుంటారు. శ్రీదేవి ఎలా మరణించి ఉంటారో తెలియదు కానీ….రిపోర్టర్ మాత్రం దాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు”…శ్రీదేవి మరణవార్తను వార్తా చానళ్లు పోటీలు పడి ఒకరికి మించి మరొకరు సృజనాత్మకను ప్రదర్శించారు.
క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా ఆమె ఏకంగా ఫిల్మ్‌నగర్‌లో చిత్ర పరిశ్రమ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా కూర్చొని తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. అయితే దీని వెనుక రాష్ట్రం కోసం చానళ్లు మారుతున్న ఓ “మహా” జర్నలిస్టు “త్యాగ”మూర్తి ఉన్నాడని మీడియా సర్కిళ్లలో ఇప్పటికీ చర్చ నడుస్తోంది.
బట్టలిప్పి ఫిల్మ్‌నగర్‌లో నడిరోడ్డుపై నిరసనకు దిగిన ఆ నటి ఒళ్లుపై కనీస మానవత్వంతో బట్టలు కప్పాలనే సంస్కారం లేకుండా ….అ అమ్మాయి నోటికి మైక్ పెట్టిన “మహా” జర్నలిస్టుల ఘనత చూశాం. లోకం ఏమై పోయినా ఫర్వాలేదు, జర్నలిజం విలువలా…అంటే ఏంటి? అని ప్రశ్నించే నికృష్ణమైన జర్నలిస్టు ఆడిన నాటకాన్ని కూడా శ్రీరెడ్డి వ్యవహారంలో ప్రత్యక్షంగా చూశాం. శ్రీరెడ్డితో రోజులు, గంటల తరబడి చర్చలు సాగించిన తీరుతో జనం ఎంతగా విసిగిపోయారో మనందరికీ తెలిసిందే.
అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య. హత్య జరిగిన మరుక్షణమే ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, జర్నలిస్టులంతా సామాజిక బాధ్యతగా గొట్టాలు పట్టుకుని మిర్యాలగూడ వెళ్లారు. కళ్లెదుటే భర్తను కోల్పోయి, కడుపులో బిడ్డతో ఆస్పత్రి పాలైన అమృతను మీడియా రాబంధులు ఏ మాత్రం విడిచి పెట్టలేదు.
ఒకవైపు భర్తను కోల్పోయి, అతి చిన్న వయసులో జీవితం అంధకారమై, భవిష్యత్ ప్రశ్నార్థకమై, దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రిలో ఉన్న అమృత నోటికి మీడియా తన గొట్టాలను సామాజిక బాధ్యతతో పెట్టాయి. పాపం ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నా చానళ్ల ప్రతినిధులు విడిచిపెట్టని వైనాన్ని చూశాం.
అలాగే జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రకటనకు…దక్షిణాఫ్రికా ప్రేరణ అని చెబితే….ఇదే రాష్ట్రం కోసం చానల్ మారిన “త్యాగ”మూర్తి అనే జర్నలిస్టు …ఆ దేశంలోని మూడు రాజధానులను సందర్శించి , అక్కడి పరిస్థితులను తెలుగు సమాజానికి చెప్పడం చూశాం.
మరి ఇప్పుడు కరోనా విషయంలో మాత్రం మీడియా తన సామాజిక బాధ్యతను ….మిగిలిన విషయాల్లో నిర్వర్తించినట్టు ఎందుకు ఇక్కడ చూపలేదు అనే ప్రశ్న ఎదురవుతోంది. కరోనా బాధితులను కనీసం పలకరించిన పాపాన పోవడం లేదు. పాపం తమ సామాజిక బాధ్యతను ఎక్కడ దాచారో అర్థం కావడంలేదు. కరోనా బాధితులతో ఇంటర్వ్యూలు చేస్తే…ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోననే భయంతో…జర్నలిస్టులు కనీసం బాధితుల చాయలకు కూడా పోవడం లేదు.
అసలు కరోనా బాధితుల అనుభవాలు ఏంటో చెవులారా విందాం, కనులారా చూద్దామని టీవీలకు అతుక్కుపోయిన జనానికి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. కరోనా నిరోధానికి ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనం గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి…వార్తా చానళ్లను పదేపదే మారుస్తున్నా, ఏ ఒక్కరూ కరోనా బాధితులతో మాట్లాడిన దాఖలాలే లేవు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఇదేనా మీడియా సామాజిక బాధ్యత. కరోనా బాధితులతో మాట్లాడించి…వాళ్లు ఏ పరిస్థితుల్లో దానికి గురి అయ్యారో చెప్పిస్తే…జనం అప్రమత్తం అవుతారు కదా? జనాన్ని అలర్ట్ చేసే సామాజిక బాధ్యతను ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎందుకు తీసుకోలేదబ్బా?
నిజానికి కరోనా బాధితుల వద్దకు వైద్య సిబ్బంది మినహా మిగిలిన వారెవరూ వెళ్లకపోవడమే సరైంది. కాకపోతే మీడియా అత్యుత్సాహంతో ఎంతసేపూ తమ రేటింగ్స్ కోసం తప్ప, సమాజ మార్పు, సంక్షేమం కోసం పనిచేయక పోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా బాధితులతో ఇంటర్వ్యూ చేస్తే తమకెక్కడ ముప్పు వస్తుందోననే భయమే….మీడియా ప్రతినిధులను కట్టడి చేసిందనేది వాస్తవం. అంటే తమ వరకు ప్రమాదం వస్తే తప్ప విచక్షణ గుర్తు రాదన్న మాట.