క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష…మ‌రీ అంత రేటా?

అస‌లే క‌రోనా వ్యాప్తితో జ‌నం అల్లాడిపోతున్నారు. జ్వ‌రం, జ‌లుబు,  ద‌గ్గుతో బాధ‌ప‌డేవారు…ఎంత‌కైనా మంచిద‌ని క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకోవాల‌నుకుంటే, దాని ఖ‌రీదు భ‌య‌పెడుతోంది. సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో క‌రోనా నిర్ధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల…

అస‌లే క‌రోనా వ్యాప్తితో జ‌నం అల్లాడిపోతున్నారు. జ్వ‌రం, జ‌లుబు,  ద‌గ్గుతో బాధ‌ప‌డేవారు…ఎంత‌కైనా మంచిద‌ని క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకోవాల‌నుకుంటే, దాని ఖ‌రీదు భ‌య‌పెడుతోంది. సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో క‌రోనా నిర్ధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల ధ‌ర ఉండ‌టం లేదు.

చైనాలో మొద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా క‌మ్ముకుంటున్న క‌రోనా వైర‌స్‌….మ‌న‌దేశంలో కూడా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. క‌రోనా వైర‌స్   (కోవిడ్‌-19) సోకిందా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే ఒక్కో పరీక్షకు 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దేశవ్యాప్తంగా డయోగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోన్న ‘ట్రివిట్రాన్‌ న్యూబర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌’ చైర్మన్‌ జీఎస్‌కే వేలు  ఈ విష‌యం తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాన్ని భారత్‌ ల్యాబ్‌లు జర్మనీ, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని, దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే 500 రూపాయల చొప్పున పరీక్షలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు.  

సుమారు రూ.5 వేలను కేవ‌లం నిర్ధార‌ణ‌కు ఖర్చు చేయాలంటే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు డ‌బ్బు ఎక్క‌డి నుంచి తేవాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌రోనాను అరిక‌ట్టే క్ర‌మంలో ఇంటి నుంచి బ‌య‌ట‌కు పోలేని ప‌రిస్థితులు త‌లెత్తాయి. దీంతో రోజువారీ ప‌నులు చేసుకుంటూ ఏ రోజుకారోజు ఉపాధి పొందుతున్న వాళ్లు…ఇప్పుడు కుటుంబ పోష‌ణ‌కే నానా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది. అలాగే మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఇత‌ర సామాన్య ప్ర‌జ‌లు కూడా ఆదాయాన్ని కోల్పోతూ…ఈ విప‌త్తు నుంచి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డుతామురా దేవుడా అని ఆకాశం వైపు చూస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు వేల‌కు వేల రూపాయ‌లు ఎక్క‌డి నుంచి తేవాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రకారం కరోనా వైరస్‌ ప్రాథమిక పరీక్షకు రూ.1500 , అనంతరం నిర్వహించే నిర్ధారణ పరీక్షకు రూ.3వేలు ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ ల్యాబ్‌లే నిర్వహించాయి. ఇక  నుంచి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉచితంగా నిర్వహించాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి పిలుపునిచ్చింది.

అయితే ప్ర‌జ‌ల జ‌బ్బుల‌ను సొమ్ము చేసుకునే ప్రైవేట్‌, కార్పొరేట్ ఆస్ప‌త్రులు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా చేస్తాయా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.  ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ప్రస్తుతం అనుమానితులందరికి ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. కేవ‌లం విదేశాల నుంచి వచ్చిన వారికి, వైరస్‌ నిర్ధారిత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం థర్మల్‌ గన్‌తో పరీక్షిస్తూన్నది జ్వరం ద్వారా అనుమానితులను గుర్తించేందుకు మాత్రమే!  

దేశంలో వందలోపు వ్రైవేటు ల్యాబ్‌లకే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉందని జీఎస్‌కే వేలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు వేలాది మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే కష్టమే. ఒక‌వేళ పెద్ద సంఖ్య‌లో క‌రోనా బాధితులు త‌యారైతే మ‌న దేశంలో వైద్య స‌దుపాయం అందించే సౌక‌ర్యాలున్నాయా అంటే లేవ‌నే స‌మాధానం వ‌స్తోంది. మున్ముందు ఈ క‌రోనా ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు తీసుకొస్తుందోన‌ని జ‌నం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.