ఇండస్ట్రీలోకి ఓ కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు ఓ ఛాన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు రవితేజ. దాదాపు హీరోయిన్లందరితో నటించిన ఈ సీనియర్ నటుడు, ఇప్పుడు మరో ఇద్దరికి అవకాశం ఇవ్వబోతున్నాడు. వాళ్లెవరో చూద్దాం.
రీసెంట్ గా ఓ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. కొత్త కుర్రాడు శరత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. యదార్థ ఘటనల ఆధారంగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా మలయాళ నటి రాజీషా విజయన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. మలయాళంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, రీసెంట్ గా తమిళ్ లో ధనుష్ నటించిన కర్నన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ మూవీ చూసిన తర్వాత రవితేజ సినిమా కోసం ఆమెను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సంప్రదింపులు మొదలయ్యాయి. ఆమె ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదే సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా దివ్యాంశ కౌషిక్ ను తీసుకున్నారు. తెలుగులో మజిలీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు రవితేజ సినిమాలో నటించబోతోంది.
ఇలా ఎప్పటికప్పుడు తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు చోటివ్వడానికి ప్రయత్నిస్తుంటాడు రవితేజ. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లు కూడా టాలీవుడ్ కు కొత్త హీరోయిన్లే.