నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేస్తున్న మందుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం ఈ మందు శాస్త్రీయత, కరోనాపై ప్రభావం, దుష్ఫ్రభావంపై నిగ్గు తేల్చేందుకు అధ్యయనానికి ఆదేశించింది. అయితే జనంలో ఈ మందుపై సానుకూలత, మరో వైపు జాప్యం జరుగుతుండడాన్ని ప్రధాన ప్రతిపక్షం రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నం వేగవంతం చేసింది. ఇందుకు ఆ పార్టీ అనుకూల మీడియా తనవంతు పాత్రను విజయవంతం పోషిస్తోంది.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జెడ్.శివప్రసాద్ తదితరులు మంగళవారం కృష్ణపట్నాన్ని సందర్శించినప్పుడు సినీ ఫక్కీలో ఓ ఘటన చోటు చేసుకుంది. ముందుగా ఆ సంఘటన గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వెల్లువెత్తుతున్న ప్రశ్నలను తెలుసుకుందాం.
కృష్ణపట్నంలో ఆనందయ్య భార్యను టీడీపీ నేతలు సన్మానించారు. అనంతరం మందులు తయారీ ప్రాంతానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ పరుగెత్తుతూ వచ్చి తన బిడ్డ కరోనా సోకి ఊపిరి ఆడక అల్లాడుతున్నాడని, కాపాడాలని ప్రాధేయపడింది. దూరంగా చెట్టుకింద పడుకున్న కొడుకును చూపించిందామె. గ్రామానికి చెందిన ఓ యువకుడు తనవద్ద ఉన్న బాటిల్ తీసి బాధితుడి కళ్లలో రెండు చుక్కల మందు వేశాడు. మరికొంత మందును నోటి ద్వారా మింగించాడు.
సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత సదరు బాధిత యువకుడు లేచి కూర్చున్నాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. అనంతరం ఆ యువకుడు మాట్లాడుతూ తనది తెలంగాణ రాష్ట్రం మంథని జిల్లా పెద్దపల్లిగా చెప్పుకొచ్చాడు. తాను 20 రోజులుగా కరోనాతో బాధపడుతున్నట్టు చెప్పాడు.
ఆస్పత్రుల చుట్టూ తిరిగి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నా నయం కాలేదన్నాడు. చివరికి ఆనందయ్య మందు గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పాడు. మందు వేసిన తర్వాత ఐదు నిమిషాలకే లేని నిలబడడడే కాకుండా రన్నింగ్ చేయాలనే ఉత్సాహంగా ఉందని యువకుడు తెలిపాడు.
ఇలాంటి మందు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం తమలాంటి పేదలకు అన్యాయం చేయడమే అని విమర్శించాడు. కార్పొరేట్ల కోసం పేదలకు అన్యాయం చేయాలను కుంటే మా స్టూడెంట్స్ ఊరుకోం అని ప్రకాశ్ హెచ్చరించడం గమనార్హం. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ అనందయ్య మందును రేపటి నుంచే పంపిణీ చేయాలని డిమాండ్ చేశాడు.
టీడీపీ నేతల సమక్షంలో నాటకీయ ఫక్కీలో ఘటన చోటు చేసుకోవడం, సదరు బాధిత యువకుడు విమర్శలు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఆనందయ్య మందును ప్రకాశ్ లాంటి పేదవాడు తీసుకున్నట్టుగానే, సోమిరెడ్డికి సంబంధించిన వాళ్లో, ధనవంతుల కుటుంబ సభ్యులో తీసుకుంటే మరింత నమ్మకం కుదురుతుందని, ఆ పని చేయగలరా? అని ప్రశ్నించే వాళ్లు ఎక్కువయ్యారు.
నిజంగా ఆనందయ్య మందుపై టీడీపీ రాజకీయ విమర్శలు మాని, దాన్ని ఊరోళ్లకు కాకుండా సొంతోళ్లకు వాడి ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించాలనే డిమాండ్స్ ఒక వర్గం నుంచి వస్తున్నాయి. తమ వాళ్లకు మాత్రం అల్లోపతి వైద్యం, పేదోళ్లకు మాత్రం ఆనందయ్య మందా? అనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోణంలో వస్తున్న ప్రశ్నలపై కూడా సీరియస్‌గా ఆలోచించాల్సిందే.