టీడీపీ మరోసారి ఆత్మ వంచన, పరనిందకు సిద్ధమైంది. ఇందుకు మహానాడు వేదిక కానుంది. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో జూమ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు నిర్వహించడం తెలిసిందే. తాజాగా గురు, శుక్రవారాల్లో (27,28 తేదీల్లో) మరోసారి ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. మహానాడు చర్చించాల్సిన అంశాలపై ఒక స్పష్టత వచ్చింది.
రెండురోజుల పాటు నిర్వహించే మహానాడుపై అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ ఖరారు చేసిన అంశాల గురించి తెలుసుకుంటే, తనను తాను వంచించుకుంటూ, పార్టీ శ్రేణుల్ని, ప్రజానీకాన్ని ఏ విధంగా చంద్రబాబు మోసం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి రోజు కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించడం, ప్రజలపై పన్నుల భారాలు, కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోవడం, ఉన్న పరిశ్రమ లపై రకరకాల పేర్లతో దాడులతో మూసివేయడం, నిరుద్యోగం పెరిగిపోవడంపై చర్చిస్తారు.
రెండోరోజు రాజధాని అమరావతి విచ్ఛిన్నంతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడంపై ప్రత్యేక తీర్మానం , నకిలీ నవరత్నాలు, ప్రజా వేదిక కూల్చివేత, ప్రతిపక్షాలు, మీడియాపై దాడులు, రాజకీయ కక్ష సాధింపులు, ప్రశ్నించిన వారి ఆస్తుల ధ్వంసం, శాంతి భద్రతల క్షీణ తపై చర్చిస్తారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పటిష్ఠతపై తీర్మానం చేస్తారు.
అసలు అంశాల్ని వదిలేసి, కొసరుపై చర్చించాలనే టీడీపీ తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఏవైతే మహానాడులో చర్చించాలని నిర్ణయించారో, వాటిపై ప్రతిరోజూ మాట్లాడుతున్నవే కదా అనే చర్చ మొదలైంది. ఈ మాత్రం దానికి మహానాడే ఎందుకనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ బలహీనపడడానికి కారణాలు, లోపాల గురించి చర్చించే అంశాల ప్రస్తావన ఎక్కడ? అనే నిలదీతలు మొదలయ్యాయి.
ఈ ఏడాదిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని చవి చూసింది. చివరికి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత స్వయంగా చంద్రబాబే కుప్పం వెళ్లి భరోసా ఇవ్వాల్సి వచ్చింది.
అలాగే పురపాలక ఎన్నికల్లో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహాయించి మిగిలిన అన్ని చోట్ల టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. చివరికి రాజధాని అమరావతిని జగన్ ప్రభుత్వం మార్చేసిందని, ఆ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఉందనే టీడీపీ ప్రచారంలోని డొల్లతనాన్ని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బయట పెట్టాయి. అక్కడ కూడా అధికార పార్టీ విజయఢంకా మోగించింది.
ఈ నేపథ్యంలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ఓటమిపై మహానాడులో చర్చించకపోవడం కంటే మహా మోసం ఏదైనా ఉంటుందా? అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
టీడీపీ ఆత్మపరిశీలనకు, అంతర్మథనానికి మహానాడు వేదికగా చేసుకోవాలని భావించి ఉంటే బాగుండేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఎంచుకున్న అంశాలను పరిశీలిస్తే మరోసారి ఆత్మ వంచన చేసుకోడానికే సిద్ధమైనట్టు కనిపిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి పార్టీ గమ్యం లేని ప్రయాణం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సొదుం రమణ