ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. బ్యాకాంక్ పర్యటనలో ఉన్న ఆమెకు హార్ట్ అటాక్ రావడంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
కాగా విజయ్ రాఘవేంద్ర 2007లో స్పందనను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం తన సినిమా విడుదలకు సిద్దంగా ఉండటంతో మూవీ ప్రమోషన్‌లో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన బెంగుళూరులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఇప్పటికే బ్యాంకాక్‌కు బయలు దేరినట్లు తెలుస్తోంది.
కన్నడ కంఠీరవుడు, రాజ్ కుమార్ మేనల్లుడే విజయ్ రాఘవేంద్ర. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుటిగా, దర్శకుడిగా పని చేశారు. మాల్గుడి డేస్, కిస్మత్, మాస్ లీడర్, నినగాగి లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. 2016లో రవిచంద్రన్ ‘అపూర్వ’ చిత్రంలో విజయ్ రాఘవేంద్రతో పాటు తన భార్య స్పందన కూడా నటించారు. స్పందన రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి బికె శివరామ్ కుమార్తె.