రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కాలం మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఏపీ కంటే కాస్త ముందుగా జరుగుతాయి. ఆ తర్వాత తెలంగాణ, ఏపీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా అదనంగా జరిగే సంగతి తెలిసిందే. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ… విడివిడిగా కలబడనున్నాయి. దీంతో బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ ఒంటరిగా బరిలో దిగనుంది. తేలాల్సిందల్లా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసా? విడివిడిగా పోటీ చేస్తాయా? అనేది. పవన్‌కల్యాణ్ మాత్రం వైసీపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని అంటున్నారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షాల సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని కొత్త పల్లవి అందుకున్నారు. ఒక్కోసారి ఒక్కోలా ఆయన మాట్లాడుతున్నారు.
ఒక సారి జనసేన ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు. మరోసారి ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని మాట్లాడుతున్నారు. ఇంకోవైపు టీడీపీ మాత్రం తనకు తానుగా పోటీకి సిద్ధమవుతోంది. మరోసారి చంద్రబాబే సీఎం అవుతారని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
గుంటూరులో జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో త్వరలో చెబుతామన్నారు. అప్పటి వరకూ మీడియా వెయిట్ చేయాలని ఆయన కోరారు. వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టత ఇచ్చారు. దీంతో పొత్తులో భాగంగానే ఎన్నికలకు వెళ్లాలని జనసేనాని ఆలోచన చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
టీడీపీ, బీజేపీలతో ఒక అవగాహనకు రాకుండా పవన్‌కల్యాణ్ సీట్ల విషయమై క్లారిటీ ఇచ్చేంత ధైర్యం చేస్తారా? అనే ప్రశ్న ఉత్నన్నమవుతోంది. ఏది ఏమైనా మూడు పార్టీల పొత్తులపై ఏపీలో అధికారం ఎవరదనేది ఆధారపడి వుంటుంది. పొత్తుతో పని లేకుండానే అధికారంలోకి వస్తామనే ధీమా టీడీపీలో పెరిగి, జనసేనాని డిమాండ్లు ఎక్కువగా ఉంటే మాత్రం ఎవరికి వారు ఒంటరిగా బరిలో నిలిచే అవకాశాలున్నాయి.