రాజకీయ తెరపై తనకు మించిన నటుడు మరెవరూ లేరని చంద్రబాబునాయుడు మరోసారి నిరూపించుకున్నారు. మొగున్ని కొట్టి మొగసాల ఎక్కిన చందంగా బాబు తీరు వుంది. పుంగనూరులో ఏయ్ కొట్టండి, తరమండి అని తన పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు రెచ్చగొట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాగైనా హింసాత్మక ఘటనలను క్రియేట్ చేసి, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపు కోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే.
పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడిలో పెద్ద సంఖ్యలో పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాబు చిత్తూరు జిల్లా పర్యటనలో అవాంఛనీయ ఘటనలకు కారకులైన వారిపై పోలీస్ వేట మొదలైంది. ఇప్పటికి 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు వార్నింగ్ ఇవ్వడం విశేషం. పుంగనూరులో అరాచకాలకు కారకులైన వారిని అరెస్ట్ చేయకుండా సన్మానించాలనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు.
పుంగనూరు ఘటనకు బాధ్యులైన తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కస్టడీలో హింసకు గురి చేస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించడం గమనార్హం. పుంగనూరులో రాజకీయ నేతల్ని సంతృప్తిపరచడానికి తప్పులు చేసే ప్రతి పోలీస్ అధికారి తమ ప్రభుత్వం రాగానే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. అరెస్ట్ అయిన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా వుండాలని ఆయన సూచించారు. న్యాయ సాయం చేస్తామని ఆయన అన్నారు.
కట్టెలు, కర్రలు తీసుకెళ్లాలని, దాడులకు పాల్పడాలని ప్రేరేపిస్తూ, ఇప్పుడు అరెస్ట్ చేశారని, కొడ్తున్నారని దొంగ ఏడ్పులు ఏడ్వడం చంద్రబాబుకే చెల్లింది. అసలు విధ్వంసానికి పాల్పడొద్దని తమ పార్టీ శ్రేణులకు సూచించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా? పార్టీ కేడర్‌పై కేసులు నమోదై, జైలు పాలైతే, తాను రాజకీయ లబ్ధి పొందవచ్చనేది బాబు వ్యూహం. బాబు మాటలకు, చేతలకు అసలు పొంతన వుండదు. రాజకీయాల్లో ఇలాంటి నటుడిని మళ్లీమళ్లీ చూసే అవకాశం రాదని వైసీపీ నేతలు వెటకరిస్తున్నారు.