ప్రజా గాయకుడు గద్దర్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా నివాళి అర్పించారు. గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న పరిచయాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. గద్దర్‌తో తనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
గద్దర్‌కు నివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం గద్దర్ పోరాడారని కొనియాడారు. ప్రజల్లో చైతన్య జ్వాలను రగిల్చిన గాయకుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ ఒక చైతన్య మూర్తి అని తెలిపారు. తన చిరకాల మిత్రుడి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్టు ఆయన గద్గద స్వరంతో అన్నారు. ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు పరిష్కారాలు కూడా సూచించే విధంగా గద్దర్ కృషి చేశారని అన్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ ఇక లేరంటే ఎంతో దుఃఖంగా వుందని ఆయన వాపోయారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళిగా జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు.
తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణకు ఇక్కడి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన మిత్రుల ఇళ్లలో శుభ, అశుభ కార్యాలకు సంబంధించి ఆయన హాజరవడం తెలిసిందే.