కరోనా కారణంగా అనేకానేక సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్లలోనే విడుదల చేసి తీరుతాం అనే పట్టుదలతో నిర్మాతలు అంతా తమ తమ సినిమాలను హోల్డ్ చేసి పెట్టుకున్నారు. పైగా దాదాపు ప్రతి సినిమాకు ఇంతో అంతో వర్క్ బకాయి వుండడం కూడా మరో కారణం. జూన్ రెండో వారం నుంచి షూటింగ్ లకు అవకాశం కనిపిస్తోంది. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ అన్నవి జూన్ రెండో వారం తరువాత ఇక వుండవని అంతా అంచనా వేస్తున్నారు.
జూన్ రెండో వారం తరువాత షూటింగ్ లు మొదలైతే, ప్యాచ్ వర్క్ లు, సిజిలు, పాటలు, ఇలా చిన్న చిన్న పనుల పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిపోయే సినిమాల జాబితా పెద్దదే వుంది. వీటిలో చిన్న సినిమాల నుంచి మీడియం, పెద్ద సినిమాల వరకు చాలా వున్నాయి.
కానీ థియేటర్లు తెరుచుకునేది ఆగస్ట్ నుంచే అని అంతా అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఆగస్ట్ నాటికి పూర్తయ్యే సినిమాలు చాలా వుంటాయి. ఇప్పటి వరకు యాభై శాతం పూర్తయిన సినిమాలు అన్నీ ఆగస్ట్ నాటికి రెడీ అయిపోతాయి. దీంతో రెడీ అయ్యే సినిమాల జాబితా మరింత పెరుగుతుంది.
దాదాపు చిన్న, మీడియం కలిపి ఇరవై నుంచి ముఫై సినిమాలకు పైగా వుంటాయి. ఇవన్నీ ఆగస్ట్ నుంచి షెడ్యూలు కావాల్సి వుంటుంది. యాభై శాతం ఆక్యుపెన్సీ, తక్కువ టికెట్ రేట్లు తమ ప్రొడెక్ట్ కు సరిపోతాయి అనుకున్న వారంతా తమ తమసినిమాలు షెడ్యూలు చేసుకుంటారు. లేని వారంతా ఇంకా అలా హోల్డ్ చేసి వుంచుకోవాల్సిందే.
కరోనా ఫస్ట్ ఫేజ్ తరువాత సినిమాలు ఇలాగే క్యూ కట్టేసాయి. వారానికి నాలుగేసి సినిమాలు వంతున విడుదలై పోటీ పడిపోయాయి. మళ్లీ అలాంటి ట్రెండ్ నే వచ్చేలా వుంది చూస్తుంటే. జనవరి నుంచి మార్చి మధ్యలో డజన్లకు డజన్లు సినిమాలు విడుదలయితే హిట్ లు మూడు నాలుగే. గట్టెక్కినవి మరో మూడు నాలుగు. మిగిలినవన్నీ కేవలం విడుదలయ్యాయి అంతే. కాస్త పోటీ తక్కువ వుంటే ఇవి కూడా కాస్త సేప్ అయ్యేవి. కానీ అలాంటి అవకాశం లేకపోయింది.
ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మళ్లీ తొడతొక్కిడి వుండేలా కనిపిస్తోంది. ఇలా అయితే చాలా సినిమాలు ఇబ్బందిపడే అవకాశం వుంది. ప్రస్తుతానికి నిర్మాతల గిల్డ్, నిర్మాతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఎలాగూ రేట్లు తక్కువ వున్నాయి. వాటిని సవరించమని అడిగే పరిస్థితి సమీప భవిష్యత్ లో లేదు.
ఇలాంటి టైమ్ షూటింగ్ లకు తొందరపడిపోయి, పెట్టుబడుల పెట్టేసి, వడ్డీలు పెంచుకోవడం అవసరమా? అనే ఆలోచనలో కూడా చాలా మంది వున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే తమ సినిమాలు విడుదల చేసుకుంటే బెటర్ అనే చిన్న సినిమాల జనాలు కూడా వున్నారు. చిన్న సినిమాలు తీస్తున్న పెద్ద నిర్మాతలు కూడా ఇదే ఆలోచనతో వున్నారు.
అందువల్ల థియేటర్లు అంటూ తెరుచుంటే ముందుగా క్యూ కట్టేవి చిన్న సినిమాలే ఎక్కువ వుండొచ్చు. ఆపైన కొద్దిగా మీడియం సినిమాలు. భారీ సినిమాలు తెరపై చూడాలనే ఆశ ఈ ఏడాది నెరవేరకపోవచ్చేమో?