ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ దిగజారుడు రాతల గురించి సోషల్ మీడియా ఎంత ఏకిపారేస్తున్నా…దాని రాతల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆర్‌కే రాతల్లో మార్పు వస్తుందని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. జగన్ సర్కార్ జారీ చేసిన జీఓ 13కు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. కర్నూలులో జుడీషియల్ కేపిటల్ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కర్నూలుకు విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలను తరలించేందుకు జీఓ 13ను జగన్ సర్కార్ జారీ చేసింది.
కర్నూలులో జుడీషియల్ కేపిటల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా జీవో 13ను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా కోర్టు సంబంధిత, న్యాయపరమైన అన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శాఖలను కర్నూలుకు తరలించి అక్కడ ఆఫీస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కొద్ది రోజుల క్రిందట అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ జీవోపై రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడి నుంచి ఏ విధంగా కార్యాలయాలు తరలిస్తున్నారు? జీఐడీలో భాగంగా ఉన్న విజిలెన్స్ కమిషరేట్‌ను తరలించడానికి వీలులేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ కేసుపై శుక్రవారం కోర్టు తీర్పును వెలువరించింది. జీవో 13ను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
స్థలాభావం కారణంగా అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. స్థలాభావం ఉంటే అమరావతికి పక్కనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి కానీ.. కర్నూలు తరలించడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కోర్టు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే ఈ తీర్పును ఆంధ్రజ్యోతి, దాని అనుబంధ చానల్ ఏబీఎన్ వక్రీకరిస్తూ వార్తలను క్యారీ చేశాయి. “రాజధాని తరలింపు కుదరదన్న హైకోర్టు.. జగన్ సర్కారు ఏం చేస్తుందో?” శీర్షికతో ఆంధ్రజ్యోతి వెబ్ పేజీలో వార్త ఇచ్చారు. అసలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలకు స్థలం లేని కారణంగా కర్నూలుకు తరలిస్తున్నట్టు జగన్ సర్కార్ చెప్పడంలోనే డొల్లతనం కనిపిస్తోంది.
అందువల్లే హైకోర్టు న్యాయమూర్తులు కూడా అక్కడ స్థలం లేకపోతే పక్కనే ఉన్న అమరావతిలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ…ఆ జీవోను కొట్టి వేశారు. మూడు రాజధానుల ప్రక్రియకు సంబంధించి ఒక వైపు హైకోర్టులో కేసులు విచారణలో ఉండగా, మరో వైపు జగన్ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఉండాల్సింది. అనవసరంగా హేతుబద్ధతకు నిలబడని జీవోలు జారీ చేయడం వల్ల ఇటు హైకోర్టులో ప్రతికూల తీర్పులు, రాజకీయంగా అభాసుపాలు కావాల్సి వచ్చింది.
కార్యాలయాల తరలింపు వద్దంటే రాజధాని మార్పునకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానించినట్టు ఆంధ్రజ్యోతిలో రాయడం ఒక్క ఆ పత్రికకే ఇలాంటివి చెల్లు. “హైకోర్టు తరలింపు కుదరదని తేల్చిచెప్పడంతో.. ఇతర శాఖల తరలింపు గురించి ఏం చేయాలా..? అని సర్కారు పునరాలోచనలో పడింది” అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి రాతల ప్రకారం విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలు అంటే హైకోర్టు అని అర్థం చేసుకోవాలా? ఏమోలే ఆర్‌కే లాంటి గొప్ప జర్నలిస్టులు రాస్తే…అలా పరిగణించాలేమో!