త‌డ‌బ‌డుతున్న ఈట‌ల అడుగులు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయ అడుగులు త‌డ‌బ‌డుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలా? బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో దేన్ని ఎంచుకోవాల‌నే విష‌య‌మై రాజేంద‌ర్ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.   Advertisement అసైన్డ్ భూముల‌కు…

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయ అడుగులు త‌డ‌బ‌డుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలా? బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో దేన్ని ఎంచుకోవాల‌నే విష‌య‌మై రాజేంద‌ర్ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.  

అసైన్డ్ భూముల‌కు సంబంధించి కుటుంబ స‌భ్యుల‌పై కేసు, మంత్రి వ‌ర్గం నుంచి కేసీఆర్ తొల‌గించ‌డంతో ఈట‌ల‌కు షాక్ కొట్టిన‌ట్టైంది. అప్ప‌టి నుంచి భ‌విష్య‌త్‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తెలియ‌ని అభ‌ద్ర‌త‌కు గుర‌వుతున్న‌ట్టు ఆయ‌న రాజ‌కీయ పంథా చెబుతోంది.

టీఆర్ఎస్‌లో ఏకాకి అయిన ఈట‌ల‌, ఇత‌ర పార్టీల నేత‌ల‌తో సంప్ర‌దింపుల్లో మునిగి తేలుతున్నారు. అయిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్‌పై ఓ నిర్ణ‌యానికి రాలేకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, టీఆర్ఎస్ అస‌మ్మ‌తి నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీఎస్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

తాజాగా ఈ రోజు మ‌రికొన్ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిష‌న్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, కేసీఆర్‌కు గ‌ట్టి స‌వాల్ విసరాల‌నే ఆలోచ‌న‌లో ఈట‌ల పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఆహ్వానాలు అందుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఈట‌ల బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌లో బీజేపీదే భ‌విష్య‌త్ అని ఈట‌ల బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు స‌మాచారం.  తాజాగా బీజేపీ జాతీయ నేతే హైదరాబాద్‌కు వచ్చి ఈటలతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం కీల‌క ప‌రిణామంగా చెబుతున్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని ఓ ఫాంహౌస్‌లో ఈట‌ల‌తో బీజేపీ జాతీయ నేత భూపేంద‌ర్ యాద‌వ్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీలో చేరాల‌ని ఈట‌ల‌కు బీజేపీ ముఖ్య‌నేత‌లంతా ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని బీజేపీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ‌ హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్య‌మైతే దుబ్బాక‌లాగా విజ‌య ఢంకా మోగిద్దామ‌ని బీజేపీ నేత‌లు భ‌రోసా ఇస్తున్న‌ట్టు స‌మాచారం. 

రాజ‌కీయంగా కూడిక‌లు, తీసివేత‌ల్లో భాగంగా ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌నే విష‌య‌మై ఈట‌ల సందిగ్ధంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. చివ‌రికి ఈట‌ల మొగ్గు ఎటు వైపు అనేది తేల్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.