చంద్రశేఖర్ గురించి రాసినపుడు అతనెవరో గుర్తు పట్టలేకపోయినా హైదరాబాదీ కదాని చదివి వుంటారు. కానీ అజిత్ (1922-98) విషయంలో ఆ బాధ లేదు. అమితాబ్, యితర హీరోల సినిమాల్లో పాలిష్డ్ విలన్‌గా, ముక్కుతో డైలాగు చెప్పే విలక్షణ నటుడిగా ఫోటో చూడగానే గుర్తు పట్టేసి వుంటారు. అతని గురించి చాలామందికి తెలియని విషయమేదైనా వుందా అంటే 200 సినిమాల దాకా వేసిన అజిత్ హీరోగా, సెకండ్ హీరోగా 80 సినిమాల దాకా వేశాకనే విలన్‌గా మారాడని! పక్కా హైదరాబాదీ పఠాన్ అని, అతనికి తెలుగు కూడా వచ్చనీ!
అతని పూర్వీకులు ఆఫ్గన్ నుంచి యుపిలో షాజహాన్‌పూర్‌కు తరలివచ్చారు. అతని తాత నిజాం సైన్యంలో చేరడానికి గోల్కొండ వచ్చి స్థిరపడ్డాడు. అతని తండ్రి కూడా నిజాం వద్దే పనిచేశాడు. నలుగురు పిల్లల్లో ఒకడు హమీద్ ఆలీ ఖాన్ (అజిత్ అసలు పేరు). 1922లో పుట్టాడు. వరంగల్, హనుమకొండలలో చదువుకున్నాడు. ఉర్దూతో బాటు తెలుగు కూడా బాగా మాట్లాడగలడు. వరంగల్ కాలేజీలో చదువుతూండగా ఫుట్‌బాల్ బాగా ఆడడంతో బాటు డ్రామాలు వేసేవాడు. వాళ్ల టీచరు ‘మంచి పెర్శనాలిటీ వుంది కాబట్టి ఆర్మీలో చేరు లేదా సినిమాల్లో చేరు’ అని సలహా యిచ్చాడు. అజిత్ తండ్రి ‘ఆర్మీ వద్దు, కావాలంటే బొంబాయి వెళ్లి సినిమాల్లో ప్రయత్నించు’ అన్నాడు. బొంబాయి వేషాలు దొరకడం కష్టమైంది. ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంటు వాళ్ల సినిమాలలో నటిస్తే రోజుకి 3-6 రూ.లు వచ్చేది.
అలా అవస్థలు పడుతూండగానే ‘‘షా ఎ మిస్ర్’’ (1946) అనే సినిమాలో గీతా బోస్ సరసన హీరో వేషం దొరికింది. తర్వాత ‘‘హాతింతాయి’’ వగైరా సినిమాలలో వేసి తన రూపంతో, వాయిస్‌తో ప్రేక్షకులను మెప్పించినా సినిమాలు ఫ్లాపయ్యాయి. ‘‘బేకసూర్’’ (1950) సినిమాలో మధుబాల సరసన నటిస్తూండగా డైరక్టర్ కె అమరనాథ్ ‘నీ పేరు మరీ పొడుగ్గా వుంది. చిన్నాగా పెట్టుకోవచ్చు కదా’ అంటే అప్పుడు ‘అజిత్’ అని మార్చుకున్నాడు. సినిమా హిట్టవడంతో దానికే ఫిక్సయిపోయాడు. నూతన్, నర్గీస్ తప్ప ఆనాటి పెద్ద హీరోయిన్ల పక్కన యితను నటించాడు. మీనాకుమారి (హాలాకు), వనమాల (సికందర్), ఖుర్షీద్ (తాన్సేన్), నళినీ జయవంత్ (నాస్తిక్), గీతా బాలి (బారాదరి), సురయ్యా (మోతీ మహల్), కామినీ కౌశల్ (బడా భాయ్), నిమ్మి (చార్ దిల్ చార్ రాహేఁ) బీనా రాయ్ (మెరైన్ డ్రైవ్), బి సరోజా దేవి (ఒపేరా హౌస్)…యిలా.
అతని మీద చిత్రీకరించిన పాటల్లో కొన్ని – ‘ఆజా కే ఇంతజార్ మేఁ’ (‘‘హాలాకు’’), ‘అగర్ మైఁ పూఛూఁ జవాబ్ దోగే?’ (‘‘షికారీ’’) ‘దేఖో మౌసమ్ క్యా బహార్ హై’ (‘‘ఒపేరా హౌస్’’) , ‘‘దేఖ్ తేరా సంసార్ కీ హాలత్ క్యా హోగయీ భగవాన్’’ (‘‘నాస్తిక్’’). హీరోగా అజిత్ వేసిన సినిమాల్లో సూపర్ హిట్ అయినది ‘‘నాస్తిక్’’ (1953).
ఈ సినిమాలేవీ పాఠకులు చూడకపోయినా ‘‘మొఘల్ ఏ ఆజమ్’’(1960) లో దిలీప్ కుమార్ స్నేహితుడైన దుర్జన్ సింగ్‌గా చూసి వుంటారు. అది పెద్దగా గుర్తుండకపోయినా‘‘నయా దౌర్’’ (1957)లో మాత్రం సెకండ్ హీరో కాబట్టి తప్పకుండా గుర్తుంటాడు. హీరోయిన్ వైజయంతీమాలను ప్రేమించి, ఆమె దిలీప్ కుమార్‌ను ప్రేమించడంతో విలన్‌గా మారి, చివర్లో మంచివాడైన పాత్ర అద్భుతంగా పోషించాడు. ‘ఏ దేశ్ హై వీర్ జవానోం కా.’ పాటలో అతని నృత్యం చూడవచ్చు. ఏది ఏమైనా ‘‘పానిక్ ఇన్ బాగ్దాద్’’ (1966) అనే సినిమా హీరోగా అతని ఆఖరి సినిమా. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘‘సూరజ్’’ (1966) తయారయ్యేటప్పుడు స్నేహితుడు రాజేంద్ర కుమార్ ‘విలన్‌గా మారితే కెరియర్ కొనసాగుతుంది కదా’ అని సలహా యిచ్చాడు. అజిత్ అది పాటించాడు. అంతే మరో 30 ఏళ్ల పాటు రంగంలో కొనసాగాడు. దేవ్ ఆనంద్ తీసిన ‘‘గాంగ్స్టర్’’ (1995) అతని ఆఖరి సినిమా.
స్ఫూరద్రూపం, గాంభీర్యం నిండిన కంఠస్వరం వున్నాయి కాబట్టి, అతను విలన్‌గా వేసినప్పుడు కూడా హుందాగానే కనబడ్డాడు. ఎప్పుడూ ఖరీదైన సూట్లు వేసుకుంటూ, పైప్ కాలుస్తూ, డాన్‌గా వుంటూ, యితరుల చేత నేరాలు, ఘోరాలు చేయించడం తప్ప, తను స్వయంగా బలాత్కారాలు చేయడం లాటివి చేయడు. గొంతు చించుకుని పెద్ద డైలాగులు చెప్పకుండా హీరోతో సమాన స్థాయిలో కనబడేవాడు. సలీమ్ ఖాన్ నటుడిగా ప్రయత్నిస్తున్నపుడు అతన్ని ప్రోత్సహించి, తను వేస్తున్న ‘‘కబ్లీ ఖాన్’’ సినిమాలో తన తమ్ముడి వేషం యిప్పించాడు. కొన్నాళ్లు పోయాక సలీమ్, జావేద్‌తో కలిసి లేఖకద్వయంగా మారాక ‘‘జంజీర్’’ (1973) అవకాశం వచ్చినపుడు అజిత్‌కు ప్రత్యేకంగా పాత్ర రాశాడు. అదీ, ‘‘యాదోం కీ బారాత్’’ (1973) సూపర్ హిట్ కావడంతో అజిత్‌కి ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఆ తరహా పాత్రల్లో స్థిరపడిపోయాడు. అగ్రశ్రేణి నటులందరితో నటించాడు. 1970లలో మొత్తం 57 సినిమాల్లో నటించాడు. ఒకటి రెండు కారెక్టర్ రోల్స్ వున్నా, ఎక్కువగా విలన్ పాత్రలే.
1985లలో గుండెపోటు రావడంతో సినిమాలు వదిలేసి హైదరాబాదు వచ్చేశాడు. కానీ జాకీ షరాఫ్-కరిశ్మా కపూర్ వేసిన ‘‘పోలీస్ ఆఫీసర్’’ (1992) సినిమాలో ఆఫర్ రావడంతో ఉండబట్టలేక తిరిగి వచ్చాడు. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సంజయ్ దత్ యిలాటి యువహీరోలతో కూడా కలిసి నటించాడు. అతను డైలాగు చెప్పే పద్ధతి విలక్షణంగా వుండడంతో మిమిక్రీ కళాకారులు అతన్ని బాగా అనుకరించేవారు. ‘మోనా డార్లింగ్…’ అనేది అతని ట్రేడ్‌మార్క్ డైలాగ్. దాని నుంచి అజిత్ జోక్స్ అని పుట్టుకుని వచ్చాయి. అవి విని అతను నవ్వుకునేవాడు. పుస్తకప్రియుడు. ఉర్దూ షాయరీలో దిట్ట.
వ్యక్తిగత జీవితానికి వస్తే 1951లో గ్వెన్ మాంటే అనే ఫ్రెంచ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత విడిపోయారు. పిల్లలు లేరు. తర్వాత తండ్రి సూచించిన షహీదా అనే అమ్మాయిని, ఆమె పోయిన తర్వాత జహీద్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తను వృత్తిరీత్యా బొంబాయిలో వున్నా ఫ్యామిలీని హైదరాబాదులోనే వుంచేవాడు. అతని ముగ్గురు కొడుకుల్లో అర్బాజ్, షెహజాద్ అతని యిష్టానికి వ్యతిరేకంగా వాళ్లు నటులయ్యారు. షెహజాద్ ఖాన్ ‘‘అందాజ్ అప్నా అప్నా’’లో తన తండ్రిని పారడీ చేస్తూ డైలాగులు చెప్పాడు. ఇద్దరూ పెద్దగా రాణించలేదు. 1998లో గుండెపోటుతో మరణించాడు. హైదరాబాదుతో సంబంధం వుండి హిందీ సీమలో ప్రఖ్యాతులైన వారిలో మ్యూజిక్ డైరక్టర్ శంకర్ (శంకర్-జైకిషన్), శ్యామ్ బెనగల్ వంటివారూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మ్యూజియం ఏర్పాటు చేసి వీరందరి వివరాలూ అక్కడ భద్రపరిస్తే బాగుంటుంది.