ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన మూడు రాజధానులు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులకు మించిన ఉత్తమమైన ఆలోచన మరొకటి లేదు. అందుకే అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నించారు. అయితే శాసనమండలిలో ఈ బిల్లుకు అడ్డంకి ఏర్పడ్డంతో ముడు.. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా వల్ల ఈ టాపిక్ పక్కకెళ్లిపోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు ఈ కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 26 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో భవనాల పరిశీలన-ఎంపిక అంతర్గతంగా పూర్తయింది. తేదీని ప్రకటించడం ఒక్కటే మిగిలింది. ఇప్పుడా తేదీ కూడా అనధికారికంగా ఫిక్స్ అయింది.
ఈ తేదీని ఫిక్స్ చేయడానికి ఓ కారణం ఉంది. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకుంది. అయితే అడ్డుకున్న 4 నెలల్లోగా తిరిగి దానిపై మండలిలో చర్చించకపోతే, బిల్లు చట్టంగా రూపుదాల్చే అవకాశం ఉంది. మండలి రద్దుకు జగన్ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి ఇక మండలిలో రాజధాని అంశంపై చర్చ అనే ప్రస్తావన అనవసరం. సో.. రాజ్యాంగం ప్రకారం మే 25 నాటికి వికేంద్రీకరణ బిల్లు చట్టంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సో.. మే 26 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా రెండు సమస్యలున్నాయి. ఒకటి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు కాగా, రెండోది కోర్టు కేసులు. ఈ రెండింటిని ఎలా అధిగమించాలనే అంశంపై ఇప్పటికే జగన్ వద్ద యాక్షన్ ప్లాన్ ఉంది. ఇక కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవనే విషయం ఆమధ్య జగన్ చేసిన ఢిల్లీ పర్యటనలతో, ఢిల్లీ పెద్దలు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రకటనలతో తేలిపోయింది.
కోర్టు గనుక అభ్యంతరం చెప్పకపోతే.. జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో 3 రాజధానులు అమల్లోకి వచ్చేస్తాయి. విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు జ్యూడీషియల్ కేపిటల్ గా, అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్ గా విధులు నిర్వర్తిస్తాయి.