రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, ప్రజల ఆదరణ పొందడానికి, వారికి దగ్గరగా ఉండటానికి రాజకీయ నాయకులు రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అనేక మార్పులు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపే వారికి ప్రధానం కాబట్టి. రాష్ట్ర విభజన జరగ్గానే ఈ సత్యాన్ని ముందుగా గ్రహించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన వైకాపా పెట్టగానే ముఖ్యమంత్రి కావడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
ప్రజలతోనే, ప్రజల మధ్యనే ఉంటే అధికార పీఠానికి చేరువ కావొచ్చని భావించారు. తాను హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఉండి ఆంధ్రాలో రాజకీయాలు చేయడం సాధ్యం కాదనుకున్నారు. అలా చేస్తే విమర్శలు వస్తాయని ఊహించారు. అందుకే అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. నేను మీ సొంత మనిషినని ప్రజలకు సంకేతాలు పంపారు.
దీంతో ఆయన సీరియస్ రాజకీయ నాయకుడని ప్రజలు గుర్తించారు. తాను ఆంధ్రాలో ఇల్లు కట్టుకోవడంవల్ల టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసే హక్కు ఆయనకు వచ్చింది. చంద్రబాబు స్థానికుడు (ఏపీలో) కాదని, ఆయన హైదరాబాదులో ఉంటూ ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నాడని ప్రజల్లో ఒక భావన కలిగించగలిగారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎదురు లేకుండా గెలిచినప్పటికీ ఆయన స్థానికుడు కాదనే భావన ప్రజల్లో ఏర్పడిపోయింది.
ఎందుకంటే బాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు కాబట్టి. ఎప్పుడూ సొంత నియోజకవర్గానికి వచ్చినా ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఇదే ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారేది. టైమ్ దొరికితే చంద్రబాబు ఇంటి గురించి విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. అయితే ఆ విమర్శ ప్రభావమో.. సొంత నియోజకవర్గంలో రాజకీయంగా ప్రతికూల వాతావరణం కనిపించడమో.. కారణం ఏదైనా.. తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు చంద్రబాబు.
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో రోడ్డుపక్కన స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందులోనూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కుదేలైపోయి చంద్రబాబు షాక్ తిన్నారు. అది కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచనకు కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు బాటలోనే ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నడుస్తున్నారు.
మాజీ సీఎం లు.. నారా చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు.. కానీ పార్టీలు.. నియోజకవర్గాలు వేరు. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని నారావారిపల్లె చంద్రబాబు నాయుడు సొంత ఊరు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా.. విపక్ష నేతగా ఉన్నా.. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. ఇక గత్యంతరం లేక ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు కలికిరి మండలం నగరిపల్లె. నల్లారి సోదరులంతా నగరిపల్లెలోని పూర్వీకుల ఇంట్లోనే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే ఇంటికి వచ్చేవారు కిరణ్ కుమార్‌రెడ్డి. 2014 రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీ పెట్టి ఘోరంగా ఓడాక రాజకీయాలకు దూరమయ్యారు. గత కొంతకాలంగా రాజకీయాకు దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ అయ్యే పనిలో పడ్డారు.
కానీ కిర్‌ణ్ కుమార్‌రెడ్డి సొదరుడు కిశోర్ కుమార్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ టికెట్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. పీలేరు టీడీపీ ఇంఛార్జ్ కూడా ఆయనే. స్థానిక రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కిశోర్ కుమార్‌రెడ్డి నగరిపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉంటున్నారు. ఇక సోదరుడు ఒక పార్టీ.. తానొక పార్టీలో కొనసాగుతూ ఒకే ఇంటిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో.. సొంతూరుకు రావడం తగ్గించేశారు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు.
పూర్వీకుల ఇంట్లో సోదరుడితో కలిసి ఉండటం కంటే.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి కిరణ్ కుమార్ రెడ్డి సైతం సొంతూరు నగరి పల్లెలో ఇటీవలే సుమారు 7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతారట. సొంత ఇళ్ల నిర్మాణంతో రాజకీయంగా బాబు, కిరణ్ కుమార్ రెడ్డి దశ తిరుగుతుందా?