మండుటెండల్లో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నట్టుగా ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. నిర్ధేశించుకున్న గడువు కన్నా పోలవరం పనులు ముందుగానే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండటం. ప్రధానంగా స్పిల్ వే పనులకు సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ వేగంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. స్పిల్ వే పనులతో పాటు వంతెనలు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్ వాల్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జలవిద్యుత్ కేంద్రం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని సమాచారం.
ప్రాజెక్టు నిర్మాణాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో డిజైన్లు రూపొందించడం, వాటికి అనుమతులు పొందడం చాలా ముఖ్యం. డిజైన్లకు ఆమోదం లభించకపోతే పనులు వేగవంతం కావు. గత నెల పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి డిజైన్ల విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో డిజైన్ల అనుమతుల వ్యవహారం చూసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
పోలవరం పనులు శరవేగంగా సాగుతూ ఉండటం యావత్ ఆంధ్రప్రదేశ్ కే శుభసూచకం అని వేరే చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వ హయాంలో వారానికి ఒక సారి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించే వారు. అయితే చంద్రబాబు నాయుడు తన సమీక్షలతో ప్రాజెక్టుకు అవరోధను కల్పించారు కానీ, పనులు మాత్రం జరగలేదు. అసెంబ్లీలో సైతం పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ డేట్లు చెప్పి చాలెంజ్ లు చేసిన నేతలున్నారు. అయితే అప్పుడు పోలవరానికి మామూలు గ్రహణాలు పట్టలేదు. అసలు ప్రాజెక్టు నిర్మాణాన్నే అర్ధరహితంగా సాగించారప్పుడు. ఫలితంగా గత ఏడాది భారీ వర్షాలతో పనులకు అవరోధం ఏర్పడింది. ఏకంగా 2.8 టీఎంసీల నీటిని బయటకు తోడితే కానీ పనులు పునఃప్రారంభించడం సాధ్యం కాలేదంటే.. గత ఐదేళ్లలో పోలవరం దశ-దిశ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అనుమతులు వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చాయి. ఆయన పాలనలోనే కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.
2010 నుంచి 2019 వరకు స్పిల్ వేలో కొంత భాగం, డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యామ్ నిర్మాణం మాత్రమే జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని పనులకు ఇంజినీరింగ్ పరంగా సమప్రాధాన్యత ఇవ్వాలి. కాని, గత ప్రభుత్వం స్పిల్ వే పనులు, కాఫర్ డ్యామ్కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అయినప్పటికీ వాటిని కూడా సకాలంలో పూర్తిచేయలేకపోయింది.