మధ్యప్రదేశ్‌లో బిజెపిని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు తన ముఖ్యమంత్రిగా యువకుడైన జ్యోతిరాదిత్య సింధియా కంటె వృద్ధుడైన కమలనాథ్‌నే ఎంపిక చేసింది. 15 ఏళ్లు ఏకధాటీగా పాలించిన బిజెపి చివరిదాకా గట్టి పోటీనిచ్చింది. కాంగ్రెసు కంటె 0.1% ఓట్లు ఎక్కువ (41-40.9) తెచ్చుకున్నా, 5 సీట్లు (114-109) తక్కువ తెచ్చుకోవడంతో అధికారాన్ని కోల్పోయింది. 3, 4 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు వచ్చినపుడు బిజెపిదే పైచేయి కావచ్చేమో తెలియదు. 29 పార్లమెంటు స్థానాల్లో 23 స్థానాలు బిజెపికి వస్తాయని సిఓటరు సర్వే చెపుతోంది. అసలు అప్పటిదాకా కాంగ్రెసును గద్దెపై ఉంచకుండా దించేయాలని బిజెపి శతథా ప్రయత్నిస్తోందట. ప్రభుత్వాల ఏర్పాటుకు, కూల్చివేతకు పార్టీ ఫిరాయింపులను ఆయుధంగా చేసుకోవడం బిజెపికి యిటీవల బాగా అలవాటైంది. మధ్యప్రదేశ్‌లో 5గురు కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గేలం వేసిందని కమలనాథ్ యిటీవలే ఇండియా టుడేకి యిచ్చిన ఓ యింటర్వ్యూలో చెప్పాడు. మరి భయపడ్డారా? అని అడిగితే, ఆ మాట కొస్తే అయిదారు మంది బిజెపి ఎమ్మెల్యేలు మావైపు దూకడానికి సిద్ధంగా వున్నామని నాతో చెప్పారు. ప్రస్తుతానికి అవసరం లేదన్నాను అని జవాబిచ్చాడు. ఇలాటి రాజకీయక్రీడల అవసరం ఉంది కాబట్టి అనుభవజ్ఞుడైన కమలనాథే సరైనవాడని, సింధియా చాలడని కాంగ్రెసు భావించింది.
15 ఏళ్లగా రాష్ట్రంలో బలంగా పాతుకుపోయిన బిజెపి మూలాలు కదిలించే పనిలో కమలనాథ్ తలమునకలై ఉన్నాడు. రెండు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లను తీసేశాడు. ప్రభుత్వ నిధులతో నడిచే జన్ అభియాన్ పరిషద్ అనే సంస్థను రద్దు చేసేశాడు. దాన్ని ఆరెస్సెస్-బిజెపి కార్యకర్తలతో నింపేశారనీ, వారందరూ ఎన్నికల సమయంలో బిజెపి పక్షాన వాలంటీర్లుగా పనిచేశారనీ కాంగ్రెసు ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారం చేజిక్కడంతో ఏకంగా దాన్ని మూసేసింది. ఇక కమలనాథ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కార్పోరేషన్లలో, బోర్డుల్లో పాత ప్రభుత్వం నియమించిన రాజకీయ నాయకులందరిని తొలగించాడు. దానికోసం రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు. బిజెపి ఏమీ తగ్గటంలేదు. తొలిరోజు నుంచి కాంగ్రెసుతో కలహానికే సిద్ధపడింది. స్పీకరు ఎన్నిక దగ్గరే పేచీపెట్టింది.
మూడు దశాబ్దాల మధ్యప్రదేశ్ ఆనవాయితీ ప్రకారం స్పీకరు పదవి అధికారపక్షానికి, డిప్యూటీ స్పీకరు పదవి ప్రతిపక్షానికీ ఏకగ్రీవంగా యిస్తూ ఉంటారు. అయితే 5 ఓట్ల తేడాయే ఉంది కాబట్టి, యీసారి స్పీకరు ఎన్నికకు పోటీపెట్టి, ఫిరాయింపులను ప్రోత్సహించి, ఆ ఎన్నికలోనే అధికారపక్షాన్ని ఓడించాలని బిజెపి వ్యూహం పన్నింది. వీళ్లిద్దరికీ కాకుండా బియస్పీకి 2, సమాజ్‌వాదీకి 1, ఇతరులకు 4 సీట్లున్నాయి. చివరకు అధికారపక్షానికి చెందినతనే స్పీకరుగా ఎన్నికయ్యాడు. వీళ్లు తమను యిలా చికాకు పెట్టినందుకు ప్రతీకారంగా కమలనాథ్ డిప్యూటీ స్పీకరు పదవిని ప్రతిపక్షానికి యివ్వనన్నాడు. హీనా కావ్రే అనే ఆమెను తమ అభ్యర్థిగా నిలబెట్టాడు. బిజెపి తనూ ఓ అభ్యర్థిని నిలబెట్టి ఓడిపోయింది. ఎన్నిక సవ్యంగా జరగలేదంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానంది. చివరకు రెండు పదవులూ కాంగ్రెసుకే దక్కాయి.
కమలనాథ్ ప్రమాణస్వీకారం చేస్తూనే రైతు ఋణమాఫీపై తొలి సంతకం చేశాడు. కొన్ని రోజులకు శివరాజ్ సింగ్ చౌహాన్ 2017లో ప్రవేశపెట్టిన ''భావ్ అంతర్ (ధరలో తేడా) భుగ్తాన్ (చెల్లింపు) యోజనా'' అనే పథకాన్ని రద్దుచేశాడు. పంటల ధరల విషయంలో కేంద్రప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర, సాధారణంగా వుండవలసిన ధర వీటి మధ్య తేడాను రాష్ట్రప్రభుత్వం రైతుకు చెల్లించే స్కీము అది. ఆ పథకం ఉన్నంత కాలం చౌహాన్ గుర్తుకు వస్తాడు కాబట్టి దాన్ని రద్దు చేశామని చెప్పరు కదా, కొత్త వ్యవసాయ మంత్రి సచిన్ యాదవ్ ''ఈ లోపభూయిష్టమైన పథకం వలన పంటధర పడిపోయి రైతు నష్టపోతున్నాడు. అందుకే దీన్ని తీసేశాం.'' అని చెప్పాడు. ఈ ప్రకటన రాగానే రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు చేస్తామని బిజెపి హెచ్చరించింది. దాంతో ఈ పథకాన్ని సాంతంగా రద్దుచేయటం లేదని, సమీక్షించి, లోపాలు సవరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏవో కొద్దిమార్పులు చేసి, కొత్త పేరుతో అదే పథకాన్ని మళ్లీ పెట్టవచ్చు.
కమలనాథ్ పెళ్లికి యిచ్చే డబ్బును రూ.51 వేలకు పెంచాడు. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.300 నుంచి 600కి పెంచాడు. దాంతో బాటు ఎమర్జన్సీ ఖైదీలకు యిచ్చే పెన్షన్ పథకాన్ని తాత్కాలికంగా ఆపాడు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకి స్వాతంత్య్రయోధుల దుర్గతి వెలుగులోకి వచ్చింది. గాంధీజీ పిలుపుపై చదువు మధ్యలోనే ఆపేసి, వృత్తులకు రాజీనామా చేసి, దశాబ్దాల తరబడి జైళ్లల్లో మగ్గి, స్వాతంత్య్రం వచ్చాక ఆదాయం లేకపోవడం చేత, పిల్లలు స్థిరపడకుండా వుండడం చేత కష్టాలలో ఉన్నవారి కోసం స్వాతంత్య్రఫలాలు అనుభవిస్తున్న మనం ఏదైనా చేయాలన్న భావనతో వారికి భూములిచ్చారు, పెన్షన్లిచ్చారు. అయితే అన్ని పథకాల లాగానే అదీ కొంతమంది విషయంలో దుర్వినియోగం అయింది. 1947కి అయిదారేళ్లు వయసున్న వారు కూడా అధికార పార్టీ ప్రాపకంతో ఆ సౌకర్యాలు పొందిన సందర్భాలు బయటకు వచ్చాయి. ఎమర్జన్సీ 19 నెలలపాటు నడిచింది. పాత కాంగ్రెసు, సోషలిస్టు, లోక్‌దళ్, జనసంఘ్, సిపిఐ తప్ప తక్కిన లెఫ్ట్ పార్టీలు, డిఎంకె, ఆరెస్సెస్, మరి కొన్ని ప్రజాసంస్థలు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడాయి. వారిలో కొందరు కార్యకర్తలు జైళ్లకు వెళ్లారు. ఎమర్జన్సీ అనంతరం పాలనలోకి వచ్చి దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందినది బిజెపి (జనసంఘ్), సిపిఎం, డిఎంకె, లాలూ, ములాయం వంటి సోషలిస్టు నాయకులు.
ఉత్తరాది రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన బిజెపి, సోషలిస్టు ప్రభుత్వాలు ఎమర్జన్సీ బాధితులకు పెన్షన్లంటూ మొదలుపెట్టారు. 2014 తర్వాత వచ్చిన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పెన్షన్లను పెంచుతూ పోయాయి. కొత్తగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పథకం ప్రవేశపెట్టింది. హరియాణా 10 వేలు యిస్తోంది. యుపిలో గతంలో అఖిలేశ్ 10 వేలు యిస్తే యిప్పుడు యోగి ప్రభుత్వం 20 వేలిస్తానంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని చౌహాన్ ముఖ్యమంత్రిత్వంలోని బిజెపి ప్రభుత్వం 2008లో ''లోకనాయక్ జయప్రకాశ్ సమ్మాన్ నిధి'' పేర పెన్షన్ స్కీము ప్రారంభించింది. మెయిన్‌టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (పొడి అక్షరాల్లో – మీసా) చట్టం కింద అరెస్టయిన 2 వేల పైగా మందికి నెలకు 8 వేల రూ.లతో ప్రారంభించి, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల కంటె ఎక్కువగా రూ.25 వేలు యిస్తున్నారు. దీనివలన ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.70-75 కోట్లు ఖర్చవుతోంది.
దీనికి ఆడిట్ అభ్యంతరాలు వచ్చాయి. గతంలో స్వాతంత్య్రవీరుల విషయంలో జరిగినట్లుగానే ఈ మీసా ఖైదీల విషయంలో కూడా ఆరెస్సెస్, బిజెపి కార్యకర్తలకే యిస్తున్నారనీ, అర్హత లేనివారు కూడా వారిలో ఉన్నారనీ ఆరోపణలున్నాయి. ఒక్కరోజు జైల్లో ఉన్నా వారికీ యిచ్చేస్తున్నారట. ఇది పొందేవారిలో చౌహాన్‌తో బాటు అనేక మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా విచారించి, నిర్ధారించుకునేదాకా పెన్షన్లు ఆపేస్తున్నామని కమలనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఆర్థికపరమైన విషయాల గురించే ఎక్కువగా పట్టించుకుంటాయి. కానీ కమ్యూనిస్టులు, బిజెపి వారు సాంస్కృతిక విషయాలలో కూడా తలదూర్చి సామాజిక జీవనాన్ని తమ ఆలోచనావిధానానికి అనుకూలంగా మారుద్దామని చూస్తూంటారు. చరిత్ర పుస్తకాలను తిరగరాయించడాలు, కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టడాలు వీటిలో భాగం.
బిజెపి నాయకుడు బాబూలాల్ గౌర్ ముఖ్యమంత్రిగా ఉండగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2005లో ఓ కొత్త పద్ధతి మొదలు పెట్టింది. ప్రతీనెలా మొదటి తారీకున సెక్రటేరియట్ సిబ్బంది ఎదురుగా ఉన్న పార్కులో చేరి సామూహికంగా వందేమాతరం ఆలపించాలి. దీనివలన సిబ్బంది పనితీరు మెరుగుపడిందో లేదో ఎవరూ అంచనా వేయలేదు కానీ యిదొక సంప్రదాయంగా మారింది. వందేమాతరం పాడడానికి అభ్యంతరం పెట్టుకునే ముస్లిములను యిబ్బంది పెట్టడం తప్ప సాధించేది ఏముందో తెలియదనుకున్నాడో ఏమో కమలనాథ్ జనవరి నెల 1వ తారీకున పార్కుకి వెళ్లనక్కరలేదని చెప్పాడు. దాంతో చౌహాన్ యిది దేశద్రోహచర్య అనేశాడు. జనవరి 2న, బిజెపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పార్కులో చేరి వందేమాతరం ఆలపించారు. చివర్లో ''ఈ దేశంలో ఉండాలంటే భారతమాతకు జై అనాల్సిందే'' అనే నినాదాలు యిచ్చారు. ఈ రియాక్షన్‌తో తెల్లబోయిన కమలనాథ్ తనకు వందేమాతరంపై ఎలాటి చిన్నచూపు లేదని చెప్పుకోవలసి వచ్చింది. కొత్త పద్ధతి పెడతామని, దాని ప్రకారం సెక్రటేరియట్ సిబ్బంది యుద్ధవీరుల స్మారకచిహ్నం నుండి సెక్రటేరియట్ వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా వచ్చి, సెక్రటేరియట్ చేరి అక్కడ వందేమాతరం పాడతారని వివరణ యిచ్చాడు. శభాష్, గతంలో 1 వ తారీకున ఓ గంటో, గంటన్నరో వృథా అవుతూ ఉంటే, యికపై ఓ పూట వృథా అవుతుందన్నమాట.
వీటితో పాటు కమలనాథ్ పదవిలోకి వస్తూనే స్థానికుల ఉద్యోగావకాశాల గురించి చేసిన వ్యాఖ్య బిజెపి, ఆర్‌జెడి, జెడియు పార్టీల విమర్శలకు దారి తీసింది. ''ఇక్కడ ప్రభుత్వసాయంతో నెలకొల్పే పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు స్థానికులకు యివ్వాలి. లేకపోతే యుపి, బిహార్ వంటి యితర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల కారణంగా స్థానిక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.'' అన్నాడు కమలనాథ్. దానిపై విమర్శ రాగానే ''ఏం, అలాటి విధానం గుజరాత్‌తో సహా అనేక రాష్ట్రాలలో లేదా? ఈ డిమాండ్‌లో కొత్తేముంది?'' అని అడిగాడు. ఔచిత్యం మాట ఎలా వున్నా మధ్యప్రదేశ్ యువతకు మాత్రం యీ ప్రకటన నచ్చుతుందనడంలో సందేహం లేదు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ యిలాటి పేచీలు యింకా ఎన్ని జరుగుతాయో చూడాలి.
(ఫోటో – బిజెపి నాయకుల వందేమాతరాలాపన)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)
[email protected]