వైసీపీ విజ‌యంపై నోరెత్త‌ని ప్ర‌తిప‌క్షాలు

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంపై ప్ర‌తిప‌క్షాలు మౌనం పాటించాయి. త‌ద్వారా విజ‌యాన్ని విస్మ‌రించాల‌నేది ఆ పార్టీల వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్…

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంపై ప్ర‌తిప‌క్షాలు మౌనం పాటించాయి. త‌ద్వారా విజ‌యాన్ని విస్మ‌రించాల‌నేది ఆ పార్టీల వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ త‌దిత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ చేయ‌లేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ మాత్రం బ‌రిలోకి దిగి డిపాజిట్ కోల్పోవ‌డంలో హ్యాట్రిక్ సాధించిన‌ట్టుంది.  

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు ప్ర‌ధానంగా టీడీపీ, జ‌న‌సేన దూరంగా ఉన్న‌ప్ప‌టికీ, ఫ‌లితం కోసం ఉత్కంఠగా ఎదురు చూశాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏ మాత్రం వ్య‌తిరేక‌త ఉందో తెలుసుకోడానికి ఈ ఉప ఎన్నిక దోహ‌ద‌ప‌డుతుంద‌ని టీడీపీ, జ‌న‌సేన భావించాయి. మ‌రోవైపు 2024లో తాను ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న బీజేపీ సత్తా ఏంటో తెలుసుకోవాల‌ని కూడా జ‌న‌సేన‌, టీడీపీ భావించాయి.

బీజేపీ బ‌లం ఏంటో తేలిపోయింది. దీంతో టీడీపీ, జ‌న‌సేన ఊపిరి పీల్చుకున్నాయి. ఇక వైసీపీ విష‌యానికి వెళితే జ‌నంలో జ‌గ‌న్‌పై త‌గ్గ‌లేద‌ని నిరూపిత‌మైంది. ఈ విజ‌యం మాత్రం టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను భ‌య‌పెడుతోంది. ఈ విజ‌యం సంక్షేమ ప‌థ‌కాల ఘ‌న‌తే అని మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, నూత‌న ఎమ్మెల్యే విక్ర‌మ్‌రెడ్డి చెప్ప‌డం విశేషం. న‌వ‌ర‌త్నాల ల‌బ్ధిదారులు ప్ర‌తి ఇంట్లో ఎవ‌రో ఒక‌రు ఉండ‌డం అధికార పార్టీకి క‌లిసొచ్చే అంశ‌మ‌ని ఆత్మ‌కూరు ఫ‌లితం చెప్ప‌క‌నే చెబుతోంది.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌కు దూరంగా ఉండ‌డం వ‌ల్ల తాము ఆ విజ‌యాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటే మాత్రం ప్ర‌తిప‌క్షాలు త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే గెలుపున‌కు ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా… ఉప ఎన్నిక‌లో టీడీపీ, జ‌న‌సేన పోటీ చేసేవ‌నే అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేం.