కళ్ల ఎదురుగా ఆస్తి ఉంది. దాన్ని కించిత్తు వాడుకుని.. ఆదాయాన్ని రాబట్టినా కూడా మహాపాపం కింద గగ్గోలు పెడతారు! అదే సమయంలో.. అదే ఆస్తిని మరింతగా అభివృద్ధి చేయాలని ఇంకో గగ్గోలు నిరంతరాయంగా నడుస్తూ ఉంటుంది. చాలా చాలా కాంట్రడిక్టరీగా కనిపిస్తుంది ఈ విషయం. తలాతోకా లేని వాదనగా కూడా అనిపిస్తుంది. అయితే.. ఈ వాదన అచ్చంగా అమరావతి విషయంలోనే జరుగుతున్నది.
అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలను సేకరించారు. కొన్ని భవనాలను అరకొరగా కట్టి వదిలేసి.. ఇదిగో రాజధాని కట్టేస్తున్నాం అనే బిల్డప్ ఇచ్చిన పాత ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపారు. ఆస్తి మొత్తం, ఆ ప్రాంతం మొత్తం అలా వృథాగా పడి ఉంది. ఒక వర్గం వాళ్లందరూ కోర్టుకు వెళ్లి మరీ.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే అని కోర్టు ద్వారా ఉత్తర్వులు పుట్టించుకు వచ్చారు.
సరే అభివృద్ధి చేయాల్సిందే.. చేయడం ఎలాగ? అనేదే ప్రశ్న! ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఖాళీ ఖజానా ఉండగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడడానికి సంక్షేమానికే చాలా కష్టాలు పడుతోంది. అలాంటిది ఆస్తుల అభివృద్ధికి ఫోకస్ పెట్టేంత నిధులు లేవు. కానీ.. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే అంటున్నారు.
మరి అదే అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన కొన్ని భూముల్ని విక్రయించి వచ్చే సొమ్మును అభివృద్ధికి వాడుకోవచ్చునని ఆలోచిస్తే మాత్రం నానా యాగీ చేస్తున్నారు. సగం పూర్తయిన నివాస భవనాలను పూర్తి చేసి.. ప్రెవేటు సంస్థలకు లీజులకు ఇస్తే.. వచ్చే మొత్తంతో మరికొంత అభివృద్ధి పనులు చేయవచ్చు అనే ఆలోచన చేసినా కూడా అడ్డు పడుతున్నారు.
అమరావతి ప్రాంతంలో గ్రూప్ డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లు కొంత పనులు పూర్తయ్యాయి. వీటి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అయితే కేవలం నివాసభవనాలు తప్ప చుట్టు పక్కల మిగిలిన నగరం ఇంకా అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో ఆ భవనాలను పూర్తిచేసేసి.. వాటిని ప్రెవేటు యూనివర్సిటీకి అద్దెకివ్వడం ద్వారా ఏడాదికి సుమారు పదికోట్ల ఆదాయం ఆర్జించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇందులో తప్పు ఎక్కడ ఉన్నదో అర్థం కావడం లేదు గానీ.. పచ్చ మీడియా నానా యాగీ చేస్తోంది. అమరావతిలోని ఆస్తి ద్వారా ఆదాయం పుట్టిస్తే.. ఆ సొమ్ము.. తిరిగి అమరావతిలోనే అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుంది కదా.. అనే లాజిక్ వారు అర్థం చేసుకోవడం లేదు.
ఒకవైపు కోర్టు చెప్పినా సరే.. ప్రభుత్వం అమరావతిలో పనులు చేయడంలేదని నిందలు వేస్తూనే.. వారిని పనులు చేయనివ్వకుండా, అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోనివ్వకుండా అడ్డుకోడానికి జరుగుతున్న కుట్ర లాగా ఇది కనిపిస్తోంది తప్ప మరొకటి కాదు. ఈ పచ్చమీడియా లేకివేషాలను మానుకుంటే తప్ప.. అమరావతి అభివృద్ధి కావడం అనేది జరగదు!