పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి?

పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి అంటే ఆయన స్వంతానికి కాదు. 2024 ఎన్నికల్లో తన పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలను అయినా గెలిపించుకోవడానికి ఎంత కావాల్సి వుంటుందని. పవన్ కేనా? జగన్ కు, చంద్రబాబు…

పవన్ కు ఎన్ని డబ్బులు కావాలి అంటే ఆయన స్వంతానికి కాదు. 2024 ఎన్నికల్లో తన పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలను అయినా గెలిపించుకోవడానికి ఎంత కావాల్సి వుంటుందని. పవన్ కేనా? జగన్ కు, చంద్రబాబు కు అక్కరలేదా? అని కూడా అడగొచ్చు. 

జగన్ అధికారంలో వున్నారు. చంద్రబాబు అనేక ఏళ్లు అధికారంలో వుండి వచ్చారు. పైగా తెలుగునాట బలమైన రెండు కులాలు ఆ రెండు పార్టీల వెనుక వున్నాయి. జనసేనకు కూడా భారీ పెట్టుబడి పెట్టాలంటే మళ్లీ ఆ రెండు కులాలే ఎక్కువగా ముందుకు రావాల్సి వుంటుంది. 

పవన్ కనుక చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 20 లేదా ముఫై సీట్లు తన వాటాగా తీసుకుంటే పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే తక్కువ సీట్లు కనుక పోటీ పడేవారు ఎక్కువే వుంటారు కనుక, డబ్బులున్న బాబులను ఏరి కోరి టికెట్ లు ఇచ్చుకోవచ్చు. పైగా చంద్రబాబు కూడా ఇంతో అంతో సాయం పట్టే అవకాశం వుంది. 

అలా కాకుండా నాగబాబు కోరుతున్నట్లు, పవన్ అడుగుతున్నట్లు జనం ఒక్క అవకాశం ఇవ్వాలి అంటే పవన్ కనీసం 100 స్థానాల్లో పోటీ చేయాలి. అలా చేయాలి అంటే పొత్తు అనేది మరచిపోవాలి. పోనీ ఎంత ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసినా, పార్టీ తరపున ఒక్కొక్కరికి రెండు మూడు కోట్లు అయినా అందించాల్సి వుంటుంది. 

అప్పుడే వాళ్లు మిగిలిన అభ్యర్థులతో పోటీ పడగలరు. అలా అందించాలంటే పవన్ కు కనీసం 300 కోట్ల రూపాయల నిధులు కావాలి. పైగా సెంట్రల్ ఆఫీస్ నుంచి డిజిటిల్ మీడియా సపోర్టు, సోషల్ మీడియా నిర్వహణ అన్నవి చూసుకోవాల్సి వుంటుంది. పవన్ సభలు, సమావేశాలు వుండనే వుంటాయి. 

పోనీ పవన్ కు కూడా కాంట్రాక్టర్లు, బిజినెస్ మన్ లు ఎంతో కొంత సాయం చేస్తారు అని అనుకున్నా, 300 కోట్ల మేరకు అసాధ్యం. అందువల్ల 2024 వేళకు పొత్తు దారిలో వెళ్లడమే పవన్ కు మంచిదేమో? అన్ని విధాలా సులువుగా వుంటుంది. అనువుగా వుంటుంది.