ఉమ్మడి విశాఖలో రాజకీయం కాస్తా అయ్యన్న వర్సెస్ వైసీపీగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా అటూ ఇటూ మాటల తూటాలు వాడిగా వేడిగా పేలుతున్నాయి. ఇపుడు సీన్ లోకి కొత్తగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నాయకుడు చెంగల వెంకటరావు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.
అయ్యన్న ఇంతకాలం చెలరేగింది చాలు, నీ గుట్టు మొత్తం నా దగ్గర ఉంది. నీవు గంజాయి వ్యాపారం ఎలా చేసింది అన్నీ ఆధారాలతో తొందరలో సీఎం జగన్ కి కలసి విచారణ కోరుతాను అంటూ చెంగల గట్టిగానే మాట్లాడారు. అంతే కాదు ఇంతకాలం అయ్యన్న మాట్లాడింది ఒక ఎత్తు. ఇక మీద జగన్ మీద వైసీపీ సర్కార్ మీద అనుచిత కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నీ ఇంటికి వస్తా నట్టింటికి వస్తా. మహిళల చేతనే నీకు పరాభవం చేయిస్తా అంటూ ఆయన ఏకంగా సమరసింహారెడ్డి డైలాగులనే వల్లించారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కావడం ఇక్కడ విశేషం. ఇక చెంగల అయ్యన్న గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. చెంగల ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఆ మధ్యన జైలుకు వెళ్ళారు. ఈ నేపధ్యంలో అక్కడ ఆయనకు బాబా చౌదరి అనే వ్యక్తి పరిచయం అయ్యారుట.
ఆ బాబా చౌదరి పేరు మోసిన అంతర్జాతీయ గంజాయి స్మగ్లర్ అని ఆయనకు అయ్యన్నతో ఉన్న లింకులు అన్నీ కూడా తనకు చెప్పారని, ఇక బాబా చౌదరిని రక్షించింది కూడా టీడీపీ హయాంలో అయ్యన్న అని అంటున్నారు.
ఈ విషయాల మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని, అయ్యన్న గంజాయి భాగోతాన్ని బయటపెట్టేవరకూ ఊరుకోమని అంటున్నారు. చెంగల ఎంట్రీతో విశాఖ జిల్లా రాజకీయం కొత్త మలుపు తిరిగింది.