ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ ఉంటుందా ఉండదా అన్న సందిగ్దం నెలకొంది. జూలై 4న విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ప్రధాని ఏపీకి వస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ప్రధాని మోడీ భీమవరంలో అల్లూరి జయంతి ఉత్సవాలను ప్రారంభించి సాయంత్రానికి విశాఖ వస్తారు, విశాఖలో బహిరంగ సభ ఉంటుంది అని.
కానీ ఇపుడు చూస్తే విశాఖలో మోడీ టూర్ మీద స్పష్టత అయితే లేదు. భీమవరం ప్రోగ్రాం మాత్రమే ఇప్పటికి ఖరారు అయింది అంటున్నారు. మరి విశాఖ ప్రధాని వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రాన్ని నిలదీస్తామని చెబుతున్న విశాఖ ఉక్కు ఉద్యమ నాయకులు ఆదివారం 500 రోజుల నిరసన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగ రావు మాట్లాడుతూ తొందరలో ప్రధాని మోడీ విశాఖ వస్తారని అంటున్నారు. మోడీ విమానం దిగి విశాఖలో అడుగుపెట్టకుండా ఉక్కు కార్మికులు నల్ల జెండాలతో తమ నిరసన తెలపాలని పిలుపు ఇచ్చారు.
ప్రధాని విమానం అటు నుంచి అటే వెళ్ళిపోయేలా విశాఖ ఉద్యమ సెగ రగిలించాలని కోరారు. అంటే విశాఖ మోడీ వచ్చినా భారీ నిరసనలు స్వాగతం పలకడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందా అన్న డౌట్లు వస్తున్నాయి.