
ఒక మిత్రుడు చెబితే "ఆహా"లో "రైటర్" చూశాను. ఇది వచ్చి నెల దాటింది. ఇప్పటి వరకూ చూడకపోవడం పొరపాటు. మన వ్యవస్థకి సంబంధించిన సినిమాలు, అందులోనూ కులం కోణాన్ని స్పర్శిస్తూ చాలా తక్కువ వస్తాయి. ఇవి మనకు కొత్తకాదు, కానీ అరుదు. 1993లో ఉమామహేశ్వరరావు అంకురం తీశారు. పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసిన వ్యక్తి గురించి ఒక అమ్మాయి పోరాటం ఈ కథ.
రైటర్‌లో పోలీసు వ్యవస్థపై ఒక పోలీసే అంతర్గతంగా పోరాడుతాడు. కేవలం పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల మధ్యే ఎక్కువ కథ నడుస్తుంది. రైటర్‌గా సముద్రఖని నటించాడు. మనస్సాక్షి వున్న వాళ్లు డిపార్ట్‌మెంట్‌లో ఎంత అపరాధ భావనకి లోనవుతారో ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్ర చేయలేరు అన్నంత బాగా నటించాడు.
పోలీస్ యూనియన్ కోసం కోర్టులో పోరాడుతున్న గంగరాజు (సముద్రఖని)కి బదిలీ వస్తుంది. కొన్ని నెలల్లో రిటైర్ అయ్యే వయసు. కొత్తగా వచ్చిన స్టేషన్‌లో అన్యాయంగా నక్సలైట్ కేసులో ఇరికించిన కుర్రాన్ని చూస్తాడు. అతన్ని విడిపించడానికి రైటర్‌గా పడే తపన , క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్. మొత్తంగా మనం కదలకుండా చూడడానికి కారణం స్క్రీన్ ప్లే , పాత్రల పరిశీలన.
జర్నలిస్టుగా చాలా మంది పోలీసుల్ని, అధికారుల్ని చూశాను. వాళ్లెందుకో బాగా ఫ్రస్ట్రేషన్‌లో వుంటారు. SIలు, CIలు కూడా పై అధికారులతో దారుణంగా తిట్లు తింటూ వుంటారు. కింద పనిచేసే కానిస్టేబుళ్లను అదే రకంగా తిడుతూ వుంటారు. కాలం మారింది అనుకుంటాం కానీ, పెద్దగా ఏమీ మారలేదు.
ఒక మిత్రుడు తాను కుప్పం దగ్గర చేసిన ఎన్‌కౌంటర్ గురించి పదేపదే బాధపడే వాడు. ఆ అపరాధ భావనే ఆరోగ్యాన్ని తినేసింది. తొందరగా పోయాడు. ఇంకో SI మందు కొడితే పెద్దగా ఏడ్చేవాడు. సర్వీస్‌లో ఎక్కువ కాలం పని చేసిన CI 50 ఏళ్లకే గుండెపోటుతో పోయాడు. ప్రతిరోజూ మనుషుల్ని కొట్టాలంటే చాలా మానసిక శక్తి కావాలి.
పోలీసుల బాడీ లాంగ్వేజీ, అధికారుల జులుం రైటర్‌లో యథాతథంగా సహజంగా వుంది. ఇంకో విషయం కులం. సమాన హక్కులు ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వాలు అంటాయి కానీ, నిజానికి వాస్తవం వేరు. లెక్కలు తీసి చూడండి. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లలో ఎక్కువగా దళిత పోలీసులు ఉంటారు. కీలకమైన స్టేషన్‌లలో అగ్రవర్ణాలుంటాయి.
కులం కోణం నుంచి ప్రశ్నించడం సినిమాలు తీయడం తమిళ్‌లో పెరుగుతోంది. పా.రంజిత్ , వెట్రి మారన్ లాంటి వాళ్లు దీనికి కారణం. రైటర్ నిర్మాతల్లో పా.రంజిత్ కూడా ఒకరు. తెలుగులో కరుణకుమార్ పలాస, శ్రీదేవి సోడా సెంటర్ కులం కోణంలో తీశాడు. కొత్త కథలు మనకీ వస్తున్నాయి.
అయితే పోలీస్ యూనియన్ ఉన్నా హక్కులు అడిగే పరిస్థితి వుంటుందా? పోలీసుల్లో అవినీతే కాదు, అణిచివేత కూడా ఎక్కువే. చూడాల్సిన మంచి సినిమా రైటర్.
జీఆర్ మహర్షి
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా