వైఎస్ జగన్ పై ఎవరు విమర్శలు చేసినా, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రవర్తించినా లేచే మొదటి నోరు కొడాలి నాని. చంద్రబాబు, లోకేషే, దేవినేని ఉమా.. ఇలా తన మన వర్గ, వర్ణ భేదాలు లేకుండా విరుచుకుపడిపోతారు కొడాలి నాని. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ కి వద్దాం. స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డను తిట్టనోళ్లు లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తాజా మంత్రులు, మాజీ మంత్రులు, లోకల్ లీడర్స్ సహా.. అందరూ ఓ రేంజ్ లో రమేష్ కుమార్ క్యాస్ట్ పాలిటిక్స్ పై మండిపడ్డారు.
కానీ కొడాలి నాని మాత్రం ఎందుకో నోరు మెదపలేదు. పోనీ ఆయన వేరే పనుల్లో బిజీగా ఉన్నారా, నియోజకవర్గంలో లేరా అంటే అదీ లేదు. కొడాలి నాని ఎక్కడికీ పోలేదు. కానీ ఎందుకో ఈ ఆపరేషన్ కి మాత్రం ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. చంద్రబాబు చేసిన సాయానికి రమేష్ కుమార్ బదులు తీర్చుకున్నారని జగన్ విమర్శిస్తే, మిగతా నేతలు మాత్రం ఆయన కులాన్ని బలంగా టార్గెట్ చేశారు. అసలు కమ్మజాతి అంతా ఇంతేనంటూ, ఎక్కడ ఉన్నా వారి సపోర్ట్ చంద్రబాబుకే ఉంటుందన్నట్టు మాట్లాడారు. కొంతమంది మాటలు కాస్త శృతి మించాయి కూడా.
దీంతో సహజంగానే వైసీపీలోని ఆ వర్గం కాస్త నొచ్చుకుంది. వారిలో కొడాలి నాని కూడా ఉన్నారని ఆయన సహచరులంటున్నారు. కొంతమంది వైసీపీ నేతల మాటలు ఆయనను బాధపెట్టాయట. అందుకే అదే రోజు కొడాలి ప్రెస్ మీట్ ఉన్నా కూడా అది వాయిదా పడిందని అంటున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఉన్నా లేకపోయినా.. వైసీపీలో ఉన్న కమ్మవర్గం నేతలు మాత్రం కాస్త ఇబ్బందిపడిన మాట వాస్తవం.
ఒక సందర్భంలో కమ్మవారి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ.. నాక్కూడా కమ్మోరులో స్నేహితులున్నారు, నాకు అత్యంత ఆప్తుడు కొడాలి నాని కూడా కమ్మోరే అంటూ జగన్ మాట్లాడారు. జగన్ బ్యాలెన్స్ చేసినట్టు మిగతా వాళ్లూ కూడా మాట్లాడాలని రూలేమీ లేదు, అందుకే వారి మాటలు కాస్త శృతి మించాయి, వీరి ఇగోని హర్ట్ చేశాయి.