చంద్రబాబుది నలభయ్యేళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన ముమ్మారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో మూడు సార్లు విపక్ష నేతగా ఉన్నారు. చంద్రబాబు మహానటుడు ఎన్టీయార్ కి అల్లుడు. నిజానికి బాబుకు సినీ బంధం అలా కలసింది.
మహా నటుల కుమారులు, అల్లుళ్ళూ సినీ వారసత్వం కొనసాగిస్తున్న రోజుల్లోనే బాబు మాటవరసకైనా తనకు సినీ మోజు ఉందని ఎక్కడా చెప్పుకోలేదు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేసిన బాబుకు నటులు తెలుసు. నటన ఇంకా బాగా తెలుసు.
అన్నీ తెలిశాక ఆయనకు సినీ నటన ఎందుకు. అందుకే ఆయన రాజకీయాల్లోనే మహా బాగా నటించడం మొదలుపెట్టారు, నటనలో విశ్వవిద్యాలయం అనిపించుకున్న మామ ఎన్టీయార్ చేతనే తనను మించిన మహా నటుడు చంద్రబాబు అన్న భారీ అవార్డును కూడా అందుకున్నారు.
ఇక బాబులోని నటన తెలుగు జనాలు ఎప్పటికపుడు చూస్తూ వస్తున్నదే. తాజాగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చంద్రబాబులో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నాటి మహా విలన్ రాజనాల కనిపించాడు. బాబు అపర రాజనాల మాదిరిగా కరడు కట్టిన విలన్ అవతారం ఎత్తి ఏపీ సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారని అవంతి హాట్ కామెంట్స్ చేసారు.
ఏపీలో కరోనా ఉందని చెబుతున్న చంద్రబాబు అమరావతి రాజధాని పేరిట తన మద్దతుదారులతో మందడంలో శతదినోత్సవ దీక్షలు, ఆందోళనలు ఎలా చేయిస్తున్నారని అవంతి లాజిక్ పాయింట్ లాగారు. స్థానిక ఎన్నికలను ఓ వైపు ఆపించి అభివ్రుధ్ధికి గండి కొట్టారని, ఇపుడు ఏకంగా ప్రభుత్వం మీదనే తప్పుడు లేఖల పేరిట బురద జల్లుతూ సర్కార్‌ని అస్థిర పరచే చర్యలకు దిగారని అవంతి మండిపడుతున్నారు.
మొత్తం మీద ఎన్టీయార్ కుటుంబంలో కొడుకులే నటనా వారసులు అనుకున్న వారికి తానూ ఆ రేసులో ముందున్నానని పదే పదే బాబు నిరూపించుకుంటున్నారన్నమాట.