‘బిగ్‌బాస్’ ఆదేశిస్తే త‌ప్ప నోరు తెర‌వ‌రా నిమ్మ‌గ‌డ్డ‌?

ఎంత అరిచి గీ పెట్టినా…నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ‌ని వాళ్ల‌ను ‘బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారేం’ అని అంటుంటారు. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితిలోనే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్…

ఎంత అరిచి గీ పెట్టినా…నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడ‌ని వాళ్ల‌ను ‘బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారేం’ అని అంటుంటారు. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితిలోనే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కూడా ఉన్నాడు. త‌న పేరుతో కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శికి రాసిన లేఖ‌పై రెండురోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర దుమారం చేల‌రేగుతోంది. పాల‌క ప్ర‌తిప‌క్షాలు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఒక వైపు క‌రోనా భ‌యం, మ‌రోవైపు ఈ లేఖ క‌లిగిస్తున్న రాజ‌కీయ కాలుష్యంతో ప్ర‌జ‌లు ఇబ్బందుల పాల‌వుతున్నారు.

ఇంత జ‌రుగుతున్నా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మాత్రం చోద్యం చూస్తున్నాడు. త‌న‌ను క‌ల‌సిన ఒక‌రిద్ద‌రు మీడియా ప్ర‌తినిధుల‌తోనూ, ఏఎన్ఐ అనే జాతీయ మీడియా సంస్థ‌కు మాత్రం తాను ఆ లేఖ రాయ‌లేద‌ని ముక్త‌స‌రిగా చెప్పాడు. అంతే త‌ప్ప‌, త‌న లెట‌ర్ హెడ్‌పై, త‌న సంత‌కంతో వివాదాస్ప‌ద అంశాల‌పై రాసిన లేఖ ఫేక్ అని భావిస్తే…దానిపై ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

కావాల‌నే జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇరుకున పెట్టే కుట్ర‌లో భాగంగానే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ మౌనం పాటిస్తున్నార‌నే అనుమానాలు క‌లిగిస్తున్నాయి. న‌ట‌న‌లో త‌న గురువు చంద్ర‌బాబును నిమ్మ‌గ‌డ్డ మించిపోయారంటే అతిశ‌యోక్తి కాదు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గురువారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప్ర‌ధానంగా లేఖ అంశాన్నే కేంద్రంగా చేసుకుని జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించాడు.

‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. అది వాస్తవమని ఆర్‌టీఐ చట్టం కింద ఒక వ్యక్తి సమాచారం కోరినప్పుడు హోం శాఖ సమాధానం ఇచ్చింది. కమిషనర్‌ రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఆయనకు వెంటనే కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కల్పించారు. లేఖకు ఈ ధ్రువీకరణలు చాలవా? హైకోర్టు జడ్జితో సమాన హోదా కలిగిన ఎన్నికల అధికారి ఈ రాష్ట్రంలో తన ప్రాణాలకు భద్రత లేదని కేంద్రానికి విన్నవిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి లేఖను వక్రీకరించే ప్రయత్నం చేస్తారా? ’ అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించాడు.

అలాగే లేఖ చంద్ర‌బాబు ఇంకా ఏం మాట్లాడాడంటే…

‘అధికార పార్టీ ఏకగ్రీవాల బండారాన్ని కమిషనర్‌ తన లేఖలో బయటపెట్టారు.  గత స్థానిక ఎన్నికల్లో కేవలం 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి ఏకంగా 24 శాతమయ్యాయని, ప్రతిపక్షాల వారిని తీవ్రంగా బెదిరించి దౌర్జన్యం చేసి వీటిని సాధించుకున్నారని కమిషనర్‌ ఎత్తిచూపారు ’ అని బాబు మండిప‌డ్డాడు.

ప్ర‌తిప‌క్షాలు, టీడీపీ అనుకూల చాన‌ళ్లు లేఖ‌ను అస్త్రంగా చేసుకుని జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు విమ‌ర్శ‌లు, క‌థ‌నాలు వండివారుస్తుంటే…త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డం భావ్య‌మా?  తాను రాసింటే ఆ విఫ‌యాన్ని అంగీక‌రించ‌డానికి భ‌య‌మెందుకు?

బిగ్‌బాస్ రియాల్టీ షోలో టాస్క్‌ల్లో భాగంగా బిగ్‌బాస్ బిగ్గ‌రగా స్టాచ్యూ అంటే క‌ద‌ల‌కుండా, మెద‌ల‌కుండా నిలిచిపోవ‌డం చూశాం. ఇలా బిగ్‌బాస్ త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు కంటెస్టెంట్లు స్టాచ్యూ (విగ్ర‌హం)లా నిల‌బ‌డే వాళ్లు. బ‌హుశా త‌న వెనుక నుంచి న‌డిపిస్తున్న ఆ బిగ్‌బాస్ త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ కూడా నోరు తెర‌వ‌డేమో! ఆయ‌న వ్య‌వ‌హారం చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రిలో ఆ భావ‌నే క‌లుగుతోంది.

ఎద్దు ఈనింది-దూడ‌ను గాటిన క‌ట్టేసిన రామోజీ, ఆర్‌కే