ఉరి పూర్తయింది… హెచ్చరిక మిగిలింది!

నిర్భయ దోషులను జైలు అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఉరి తీశారు. ఉరిశిక్ష తప్పించుకోవడానికి నలుగురు దోషులూ చిట్టచివరి నిమిషం వరకూ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వారి పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. గురువారం అర్ధరాత్రి…

నిర్భయ దోషులను జైలు అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఉరి తీశారు. ఉరిశిక్ష తప్పించుకోవడానికి నలుగురు దోషులూ చిట్టచివరి నిమిషం వరకూ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వారి పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. గురువారం అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాత కూడా ఉరిశిక్షపై స్టే విదించాలంటూ మళ్లీ సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. వాటిని కూడా న్యాయమూర్తులు తిరస్కరించడంతో… శుక్రవారం ఉదయం ఉరి తీయడం పూర్తయింది. నిర్భయపై అమానవీయమైన రీతిలో అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను జిల్లా మేజిస్ట్రేట్, పలువురు జైలు అధికారుల సమక్షంలో ఉరితీశారు.

ఒకేసారి నలుగురు నిందితులను ఉరితీయడం అనేది ఇటీవలి కాలంలో చరిత్రలో ఎన్నడూ లేని సంగతి. నిర్భయ దోషుల ఉరి అనేది దేశానికి ఒక గట్టి హెచ్చరిక చేసిందనడంలో సందేహం లేదు. అమ్మాయిలపై, దుర్బలమైన స్థితిలో నిస్సహాయంగా కనిపించిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడవచ్చుననే దుర్బుద్ధితో మెదలే వారికి ఇది గట్టి హెచ్చరిక. చట్టం చాలా గట్టిగా ఉంటుందని, నేరం చేసిన వాళ్లు.. చట్టం చేతుల్లోంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని యావత్ దేశానికి వచ్చిన హెచ్చరిక ఈ నిర్భయ దోషుల ఉరి!

నిర్భయ ఢిల్లీలో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆరుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. వారిలో ఒక నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో విడిచిపెట్టారు. మిగిలిన నలుగురు.. ఉరిశిక్ష విధింపబడిన తర్వాత.. దాన్నుంచి తప్పించుకోవడానికి తమ వంతుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పటికే వారిని ఉరి తీయడం కోసం మూడుసార్లు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రతిసారీ ఏదో ఒక మిషమీద, మరో కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా వారు ఉరిని నిలుపుదల చేయించుకోగలుగుతూ వచ్చారు.

ఒక దశలో భారత న్యాయవ్యవస్థ ఉదారత్వం ప్రశ్నార్థకం అయ్యేలా.. నిర్భయ దోషుల ఉరి వ్యవహారం మారిపోయింది. నేరం, అందులోని పైశాచికత్వం ధ్రువపడిన తర్వాత కూడా.. వారికి శిక్షలు అమలు చేయలేని దుర్బలత్వం న్యాయవ్యవస్థలో ఉన్నదా అనే సందేహాలు కలిగాయి. అన్నిసార్లు దోషుల తరఫున రకరకాల పిటిషన్లు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యవహారాలు నడుస్తుండగానే.. హైదరాబాదులో దిశ ఉదంతం వెలుగు చూసింది. నిందితుల్ని రోజుల వ్యవధిలోనే పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు. ఇలాంటి కేసుల్లో కోర్టుల్ని నమ్ముకుంటే కుదరదని, ఎన్ కౌంటర్ పద్ధతులే సరైనవని ప్రజలు అనుకునే వాతావరణం ఏర్పడింది.

అయితే న్యాయవ్యవస్థ నీరసించిపోలేదు. దోషులకు ఇవ్వగల న్యాయపరమైన అవకాశాలు అందకుండా చేశామనే అపప్రధ రాకుండా జాగ్రత్త తీసుకుంది. అన్ని అవకాశాలూ ఇచ్చిన తర్వాతే… వారి ఉరికి డెత్ వారంట్లు జారీ అయ్యాయి. శుక్రవారం ఉదయం ఉరి పూర్తయింది. న్యాయవ్యవస్థ లొసుగులు ఆధారం చేసుకుని చెలరేగవచ్చుననుకునే వారికి ఇది చెంపపెట్టు. చట్టం చేతులు చాలా గట్టివి అని ప్రతివాడూ తెలుసుకోవాలని చెప్పే హెచ్చరిక ఈ ఉరిశిక్ష!

నమస్కారం మన సంస్కారం