దిగారండి కొత్త బాబా…భ‌గ‌వాన్ శ్రీ‌శ్రీ‌శ్రీ‌శ్రీ నారా చంద్ర‌స్వామి

అబ్బా…ఒక‌టి కాదు, రెండు కాదు…ఏకంగా 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో పీక‌ల్లోతు మునిగి, తేలుతూ, మునిగి, తేలుతూ….చివ‌రికి ఆ రంగంపై విర‌క్తి క‌లిగి ఓ నాయ‌కుడు వైరాగ్యానికి లోన‌య్యాడు. అందులోనూ జ‌గ‌న్ లాంటి అరాచ‌క‌,…

అబ్బా…ఒక‌టి కాదు, రెండు కాదు…ఏకంగా 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో పీక‌ల్లోతు మునిగి, తేలుతూ, మునిగి, తేలుతూ….చివ‌రికి ఆ రంగంపై విర‌క్తి క‌లిగి ఓ నాయ‌కుడు వైరాగ్యానికి లోన‌య్యాడు. అందులోనూ జ‌గ‌న్ లాంటి అరాచ‌క‌, నికృష్ణ‌, ద‌గుల్భాజీ రాజ‌కీయ నాయ‌కుడు (ప్ర‌తిప‌క్షాల మాట‌ల్లో) చేస్తున్న క‌క్ష‌, వివ‌క్ష‌, విద్వేష పూరిత పాల‌న‌, రాజ‌కీయాల‌తో విసుగు, విర‌క్తి ఏక కాలంలో మ‌న‌సును ఆవ‌రించ‌డంతో….సుదీర్ఘ అనుభ‌వ‌శాలి అయిన నారా చంద్ర‌బాబునాయుడు ఓ స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు.

ఆ కొత్త అవ‌తార‌మే బాబాగా ప్ర‌జ‌ల ముందుకొచ్చాడు. ఇప్పుడాయ‌న భ‌గ‌వాన్ శ్రీ‌శ్రీ‌శ్రీ‌శ్రీ నారా చంద్ర‌స్వామిగా పేరు, రూపు, మాట‌, న‌డ‌త‌, వ‌స్త్ర‌ధార‌ణ మార్చుకుని…ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకానికి ప్ర‌వ‌చ‌నాలు, సూక్తులు చెబుతూ జ్ఞానోద‌యం క‌లిగిస్తున్నాడు. ప్ర‌తిరోజూ సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఠంచ‌న్‌గా స‌మ‌యం చూసుకుని…మంగ‌ళ‌గిరిలోని త‌న కార్యాల‌యానికి వ‌స్తారు. వార్తా చాన‌ల్స్ ఐదు గంట‌ల బులెటిన్‌లో మిగిలిన వార్త‌ల‌న్నీ ప‌క్క‌న పెట్టి….కొత్త అవ‌తారం ఎత్తిన చంద్ర‌స్వామి వారి హితోక్తులు, చ‌లోక్తుల‌ను ప్ర‌సారం చేస్తూ…అదే మ‌హాప్ర‌సాద‌మ‌ని ప్ర‌జ‌లకు పంచిపెడుతాయి.

నిన్న‌టికి నిన్న చంద్ర‌స్వామి వారు ఎన్నిక‌ల క‌మిష‌న్ గురించి ఎంత బాగా చెప్పారో ఆల‌కిద్దామా!

‘ఈ రోజు కూడా ఒక వైసీపీ ఎమ్మెల్యే కమిషనర్‌ను వెధవ అని తిట్టాడు. ఎన్నికలు వాయిదా పడితే రూ.5 వేల కోట్లు రావని జపం చేశారు. కానీ సుప్రీంకోర్టులో ఆ విషయమే చెప్పలేదు. తీర్పులోనూ ఆ ప్రస్తావన లేదు. విజ్ఞతతో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదించాల్సిందిపోయి తిట్టి పోస్తారా? స్పీకర్‌ పదవిలో ఉండి మాట్లాడే పద్ధతి అదేనా? మేం తిట్టలేమా? మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదు’….ఇదీ నారావారి చంద్ర‌స్వామి సూక్తులు.

అన్న‌ట్లు చంద్ర‌స్వామిగా మార‌క‌మునుపు ఎన్నిక‌ల సంఘం గురించి ఏం మాట్లాడారో కూడా తెలుసుకుందామా? అయితే మ‌న‌మంతా ఒక్క‌సారి 2019, ఏప్రిల్ 10వ తేదీ నాటి రోజుల‌ను గుర్తు చేసుకుందాం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఖ‌చ్చితంగా ఒకే ఒక్క రోజు ముందు. అప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబునాయుడిగా త‌న అధికార ద‌ర్బార్‌ను ఎలా చెలాయించారంటే…ఓవ‌ర్ టూ ఏపీ స‌చివాలయం.

ప్ర‌కాశం జిల్లా ఎస్పీ కోయ‌ ప్ర‌వీణ్‌ను ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేసిన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హానికి, అస‌హ‌నానికి గుర‌య్యారు.  ఏపీ స‌చివాల‌యంలో ఎన్నిక‌ల ముఖ్య అధికారి గోపాల‌కృష్ణ ద్వివేది కార్యాల‌యం. సీఎం చంద్ర‌బాబునాయుడు త‌న మందీమార్బ‌లంతో ద్వివేదీని క‌లిశాడు. సోపా సీట్లో సీఈసీతో క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూర్చున్నాడు. సీఈసీ వైపు చేతిని చూపుతూ గ‌ద్దిస్తూ, క‌ళ్లు ఉరుముతూ హెచ్చ‌రిక‌లు చేశాడు. ఆ హెచ్చ‌రిక‌లు ఏంటంటే…

‘ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌ప‌లేన‌ప్పుడు ఎన్నిక‌ల సంఘం ఎందుకు? ఏక‌ప‌క్షంగా చేసుకోండి. యంత్రాలు పెట్టుకుని రిగ్గింగ్ చేసుకోండి. అయిపోతుంది దేశంలో ఎల‌క్ష‌న్‌. మేమంతా ఇంట్లో ప‌డుకుంటాం. ఎందుక‌య్యా క‌ష్ట‌ప‌డాలి? ఎందుకు ఈ మీటింగులు మాకు? మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా?  కాదా?  ఢిల్లీ ఆదేశాలు  య‌థాత‌థంగా మీరు ఎందుకు అమ‌లు చేయాలి?  సీఈవో కార్యాల‌యం పోస్టాఫీస్ కాదు క‌దా?  రాజ్యాంగం ద్వారా సంక్ర‌మించిన అధికారాలు మీకూ ఉన్నాయి. లేదంటే సీఈఓ కార్యాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసేయ‌మ‌నండి. మిమ్మ‌ల్ని అంద‌రినీ తీసేసి ఆయ‌న్నే(ఈసీ) ఒక క్ల‌ర్క్‌ను పెట్టుకుని చేయ‌మ‌నండి. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఏంటో మేం చూస్తాం. నేను ఒక్క‌సారి దృష్టి సారించానంటే అంత తెలిగ్గా వ‌దిలిపెట్ట‌ను. లాజిక‌ల్‌గా వెళ్తాను’…అని తీవ్ర‌స్థాయిలో గ‌ద్దించాడు. ఎన్నిక‌ల రోజు ఓట‌ర్ల‌పై ప్ర‌భావితం చేసేందుకు చంద్ర‌బాబు నాడు ఆడిన డ్రామాగా అంద‌రికీ తెలిసిందే.

అలాగే అదే రోజు సీఈసీని క‌లిసిన త‌ర్వాత‌, ఆ కార్యాల‌యం ఎదుట చంద్ర‌బాబు అండ్‌కో మెరుపు ధ‌ర్నా చేప‌ట్టారు. ఒక ముఖ్య‌మంత్రి స్వ‌యంగా సీఈవోను క‌లిసి ఫిర్యాదు చేయ‌డం దేశంలోనే ఇది మొట్ట మొద‌టిసారిగా ఎల్లో ప‌త్రిక‌లు గ‌గ్గోలు పెట్టాయి. సీఈసీ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నాకు దిగిన బాబు మీడియాతో ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

‘ఎన్నిక‌ల సంఘం (ఈసీ) ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటోంది. జ‌గ‌న్‌కు జేబు సంస్థ‌గా మారింది. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ నుంచి ఎన్నిక‌ల సంఘం నేరుగా వైసీపీకి ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఎన్నిక‌లు మాత్రం నిష్పాక్షికంగా జ‌ర‌పాలి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీ సొంత కార్యాల‌యంలా ప‌నిచేస్తోంది. ఎవ‌రెవ‌రిని బ‌దిలీ చేయాలో వైసీపీనే నిర్ణ‌యిస్తోంది. ఆ త‌ర్వాత కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఆదేశాలు వ‌స్తున్నాయి.

ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన ప్ర‌ధాని మోడీ ఇప్పుడు ఈసీని కూడా బుర‌ద‌లోకి నెట్టేస్తున్నాడు. మోడీ, ఈసీ క‌లిసి ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం. ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేసే కేకే శ‌ర్మ‌ను ప్ర‌ధాన ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడి హోదాలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు పంపితే , ఆయ‌న్ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తిప్పి పంపింది. అలాంటి వ్య‌క్తిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌ధాన ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా పంప‌డంలో ఈసీ ఉద్దేశం ఏంటి?’…ఇది ఏడాది క్రితం బాబు నోటి నుంచి భార‌త‌దేశ ఎన్నిక‌ల సంఘంపై చేసిన తీవ్ర ఆరోప‌ణ‌లు.

ఇప్పుడు మాత్రం ఆయ‌న‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఉద్దేశ పూర్వ‌కంగా వాయిదా వేసిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎంతో గొప్ప అధికారిగా క‌నిపిస్తున్నాడు. నిన్న విలేక‌రుల స‌మావేశంలో బాబు మాట్లాడుతూ విజ్ఞతతో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదించాల్సిందిపోయి తిట్టి పోస్తారా? స్పీకర్‌ పదవిలో ఉండి మాట్లాడే పద్ధతి అదేనా? మేం తిట్టలేమా? మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదు అని నంగ‌నాచి క‌బుర్లు చెబుతున్నాడు. నాడు ఆయ‌న ఈసీని, ప్ర‌ధాని మోడీని మాట్లాడిన మాట‌లేంటి?  నాడు సీఈసీ కార్యాల‌యానికి వెళ్లి బాబు చేసిన ప‌ని స‌భ్య‌తేనా? త‌న‌కు అనుకూలంగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌నిచేస్తే మాత్రం జ‌నానికి హిత‌వులు, సూక్తులు, ప్ర‌వ‌చ‌నాలు చెప్ప‌డానికి మాత్రం మీడియా ముందుకు రావ‌డం ఒక్క బాబుకే చెల్లు.

నమస్కారం మన సంస్కారం