చంద్రబాబు డిమాండ్‌లో కామన్‌సెన్స్ ఉందా?

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆయన తెలివితేటలపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునేమో గానీ.. సీనియారిటీ మాత్రం నిజం. ఇంత సీనియారిటీ ఉన్న నేత కూడా ఎలాంటి కామన్ సెన్స్ లేని ప్రకటనలు చేసినప్పుడు…

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆయన తెలివితేటలపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునేమో గానీ.. సీనియారిటీ మాత్రం నిజం. ఇంత సీనియారిటీ ఉన్న నేత కూడా ఎలాంటి కామన్ సెన్స్ లేని ప్రకటనలు చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా నాయకులు.. తమకు ఇన్ పుట్స్ ఇచ్చే మేధావుల మీద ఆధారపడడం నిజమే కావొచ్చు. కానీ.. ఎవరైనా సూచించిన దానిని, తన స్వబుద్ధితో బేరీజు వేసుకుంటే ఆయన ఇలాంటి కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడరు.

తన ప్రాణాలకు ముప్పు ఉన్నదంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినట్లుగా.. బుధవారం నుంచి నానా రాద్ధాంతం జరుగుతోంది. ఈ లేఖకు సంబంధించి.. అసలు కర్త అయిన నిమ్మగడ్డ తప్ప… అందరూ మాట్లాడుతున్నారు. ఈ లేఖను ఈసీ రాశారో లేదో చెప్పాలని వైకాపా డిమాండ్ చేసినప్పటికీ ఆయన మాత్రం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ లేఖ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా సమీక్ష సమావేశంలో చర్చించారు. అనంతరం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. రాష్ట్ర డీజీపీని కలిసి అసలు ఈ లేఖ నిజమో కాదో, ఎక్కడినుంచి పుట్టిందో తేల్చాలని ఫిర్యాదు చేశారు.

ఇకపోతే.. అసలు నిజమో కాదో తెలియని లేఖ గురించి చంద్రబాబునాయుడు ఓ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ లేఖ నిజంగా వెళ్లిందో లేదో.. జగన్ సర్కారు కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. కామన్ సెన్స్ లేని ఇలాంటి డిమాండు ఆయన ఎలా చేస్తున్నారో తెలీదు.

ఎందుకంటే… లేఖ నిజమో నకిలీనో తెలీదు. ప్రభుత్వం పోలీసు దర్యాప్తు చేయిస్తోంది. అదేమీ తేలకముందే.. కేంద్రాన్ని దాని గురించి అడిగితే నవ్వులపాలు కావడం తప్ప దక్కేదేమీ ఉండదు. చంద్రబాబుకు సీనియారిటీ పెరిగిందే తప్ప.. తర్కం నశించిపోయిందని ప్రజలు నవ్వుకుంటున్నారు.

నమస్కారం మన సంస్కారం