ఇవ్వాల్సింది 200 కోట్ల డోసులు, ఇచ్చింది 20 కోట్లు!

దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టినా, మూడో వేవ్ క‌చ్చితంగా తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తూ ఉన్నారు. వైద్య‌రంగ ప్ర‌ముఖులూ ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. Advertisement వీలైనంత త్వ‌ర‌గా…

దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టినా, మూడో వేవ్ క‌చ్చితంగా తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తూ ఉన్నారు. వైద్య‌రంగ ప్ర‌ముఖులూ ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌క‌పోతే మూడో వేవ్ లో చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని వారు అంటున్నారు. అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మాత్రం చాలా నెమ్మ‌దిగా సాగుతూ ఉంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా వ్యాక్సిన్ అందుబాటులో లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఫ‌స్ట్ డోస్ కోసం ఇంకా ప‌దుల కోట్ల మంది ప్ర‌జ‌లు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఇక ఇప్ప‌టికే ఒక డోస్ వేయించుకున్న వాళ్లు రెండో డోస్ కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. ఇప్ప‌టికీ దేశంలో రోజుకు 20 ల‌క్ష‌ల డోసుల స్థాయిలోనే వ్యాక్సినేష‌న్ జ‌రుగుతూ ఉంది. దీంతో టార్గెట్ ను రీచ్ కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

20 ల‌క్ష‌ల చొప్పున వేసుకుంటూ పోతే.. దేశం మొత్తానికీ రెండు డోసుల టీకాలు వేసేందుకు క‌నీసం రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు! ఆ లోపు క‌రోనా మూడో వేవ్, నాలుగో వేవ్ కూడా వ‌చ్చి క‌ల్లోలం సృష్టించే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. అయితే వ్యాక్సినేష‌న్ స్థాయిని పెంచేందుకు కేంద్రం ఏం చ‌ర్య‌లు తీసుకుంటోందో కూడా సామాన్యుల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 19.84 కోట్ల డోసేజ్ ల వ్యాక్సిన్ వేసిన‌ట్టుగా కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. ర‌మార‌మీ సుమారు 20 కోట్ల డోసేజ్ లు అనుకున్నా.. టార్గెట్ లో 10 శాతానికి చేరువైన‌ట్టు! మార్చి నెల నుంచి భారీ ఎత్తున‌ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతూ ఉంది. మూడు నెలల స‌మ‌యం పూర్త‌వుతున్న త‌రుణంలో ప‌ది శాతం వ్యాక్సినేష‌న్ మాత్ర‌మే  జ‌రిగింద‌ని స్ప‌ష్టం అవుతోంది. 

మ‌రి మిగిలిన 90 శాతం మాటేంటో ప్ర‌స్తుతానికి అంతుబ‌ట్ట‌ని విష‌య‌మే. అమెరికా, యూర‌ప్ దేశాల్లో విస్తృతంగా వాడుతున్న వ్యాక్సిన్లు ఇండియాకు అందుబాటులోకి రావొచ్చ‌ని ఇన్నాళ్లూ వార్త‌లైనా వ‌చ్చేవి. అయితే ఇప్పుడు వాటి ఊసే వినిపించ‌డం లేదు. ర‌ష్య‌న్ వ్యాక్సిన్ కూడా ఇండియాలో ఉత్ప‌త్తై అందుబాటులోకి వ‌చ్చేందుకు ఆగ‌స్టు వ‌ర‌కూ స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. దీంతో.. వ్యాక్సినేష‌న్ పై మెజారిటీ ప్ర‌జ‌లు ఇప్పుడ‌ప్పుడే ఆశ‌లు పెట్టుకునేందుకు ఏమీ లేదేమో!